7 August, 2026 | 2:29 AM

రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు

07-08-2026 12:00 AM
  1. పరారీలో కరీంనగర్ మిల్లర్లు
  2. పలువురిపై కేసులు నమోదు

కరీంనగర్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పక్కదారి పట్టడంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కోట్ల విలువైన ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు గుర్తించి సంబంధిత మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.

దాడులకు భయపడి జగిత్యాలకు చెందిన బీజేపీ నాయకుడు, సుల్తానాబాద్‌కు చెందిన మిల్లు యజమాని పరారయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట, హుజురాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లోని పలు రైస్‌మిల్లుల్లో నిర్వహించిన సోదాల్లో వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు వెల్లడైంది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.800 కోట్ల వరకు విలువైన సీఎంఆర్ బియ్యం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనలు పాటించని, ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసిన రైస్ మిల్లుల యజమానులపై బీఎన్‌ఎస్, నిత్యావసర  చట్టాల కింద కేసులతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

కుటుంబ సభ్యుల పై కేసు నమోదు

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కొండ లక్ష్మణ్‌తోపాటు అతని కుటుంబ సభ్యులకు రైస్ మిల్లులు ఉన్నాయి. సీఎంఆర్ ద్వారా సేకరించిన ధాన్యానికి తగిన బియ్యాన్ని లెవీ చెల్లించలేదు. జగిత్యాల సమీపంలోని తక్కల్లపల్లిలోని శ్రీ అభయాంజనేయ సాయి, లక్ష్మీ బాలాజీ, లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ల ద్వారా 34,386.785 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్ సి ఐ కి అప్పగించాల్సి ఉంది.

రూ. 87.89 కోట్ల విలువైన రైస్ ప్రభుత్వానికి అప్పగించ లేదని సివిల్ సప్లై అధికారులు లెక్క తేల్చారు. దీంతో కొండ లక్ష్మణ్, అతని భార్య, జగిత్యాల మునిసిపల్ కౌన్సిలర్ కొండ అరుణ (బీజేపీ), అతని సంతానం కొండ ప్రణిత్, కొండ ఉపేందర్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 

బండారి మారుతిపై రెండు కేసులు అయ్యాయి. సుల్తానాబాద్‌లో 30 కోట్లు, కరీంనగర్‌లో 130కోట్ల విలువచేసే బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడంతో కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లాలో రైస్ మిల్లుల నుంచి గురువారం వరకు రూ.297 కోట్ల బకాయిలు ఉన్నాయని పెద్దపల్లి డీఎం శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.