02-01-2026 12:00:00 AM
ఎర్రుపాలెం జనవరి 1( విజయ క్రాంతి): జమలాపురం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తగా గురువారం నాడు ఉప్పల విజయ దేవ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రొటేషన్ ద్వారా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా ఉప్పల విజయ దేవ శర్మ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నూతన సంవత్సరం 2026 న పురస్కరించుకొని జమలాపురం క్షేత్రమునకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది ప్రాతకాలం 4-00 గంటల నుండి స్వామివారి నిత్యార్చనలు జరిపిన అనంతరం 5-30 గంటల నుండి భక్తులకుస్వామి వారు దర్శనమిచ్చారు.
ఈరోజు స్వామి వారిని సుమారు 40 వేల మంది భక్తులు వివిధ ప్రాంతాలను వచ్చి దర్శించుకున్నారు . స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఉచిత దర్శనం తో పాటు విశేష దర్శనం, శీఘ్రదర్శనం కూడా కల్పించారు. భక్తుల అందరికీ ఉచిత ప్రసాద వితరణను దాత జమలాపురం గ్రామమునకు చెందిన శ్రీ తుళ్లూరు కోటేశ్వరరావు దంపతులు అందించినారు. అదేవిధంగా స్వామివారి భక్త కళ్యాణాన్ని నిర్వహించి, ఈరోజు స్వామివారి అన్ని రకాల ఆర్జిత సేవల ద్వారా రూపాయలు 5,05,900/- ఆదాయం వచ్చినది. ఇందులో అర్చనలు, అభిషేకములు, వాహన పూజలు మరియు కళ్యాణకట్ట తలనీలాలు సమర్పణ ద్వారా లడ్డు ప్రసాద విక్రయాల ద్వారా లభించినది.
అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా దేవాలయమునకు చెందిన క్యాలెండర్ దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. దర్శించుకున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం పక్షాన కార్యనిర్వహణాధికారి శ్రీ కే. జగన్ మోహన్ రావు మరియు ఆలయ ధర్మకర్త శ్రీ ఉప్పల విజయ దేవశర్మ పర్యవేక్షణ చేసినారు.
ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్తలు ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఉప్పల జయదేవ శర్మ, జమలాపురం గ్రామ సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి , వకుళా మాత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు, గరుడాలయ నిర్మాణదాత మూల్పురి శ్రీనివాసరావు, గ్రామ ప్రజా ప్రతినిధులు నన్నపనేని రామారావు, వేమిరెడ్డి అంకిరెడ్డి, శ్రీ సత్యసాయి సేవా సమితి భక్త బృందము మరియు జమలాపురం గ్రామం చెందిన భక్త బృందం పాల్గొని స్వచ్ఛందముగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఎస్త్స్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.