25-10-2025 10:06:28 PM
- ట్రాక్టర్ ను అడ్డగించిన గ్రామస్తులు
టేకులపల్లి,(విజయక్రాంతి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఆ సమీప గ్రామస్తులు అడ్డగించారు. దీనితో అక్కడ ఇసుక రవాణాదారులు, గ్రామస్తులకు గొడవకు దారితీసింది. ఈ సంఘటన టేకులపల్లి మండలం సంపత్ నగర్ గ్రామ సమీపంలోని పాలవాగు వద్ద శనివారం చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు ఇసుకను ట్రాక్టర్లో తరలిస్తుండగా శుక్రవారం ట్రాక్టర్ వాగులో కూరుకు పోయింది.
ఆ తర్వాత మళ్ళీ కొందరు ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్లేందుకు రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దానితో అక్కడ ట్రాక్టర్ యజమాని, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. తమ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేయనీయమని గ్రామస్తులు ఖరాకండిగా తెలిపి మాటా మాటా పెరిగింది. దీనితో ఇరువర్గాలు బోడు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతొ ఇసుకాసురులు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉండటం విశేషం.