calender_icon.png 11 October, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు పాతర.. అక్రమ దందా జాతర

11-10-2025 12:49:56 AM

పట్టించుకోని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు

తాండూరు, అక్టోబర్ 10: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రానున్న దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలు నిబంధనలు ఏవి పాటించకుండా అనుమతులు ఏవి లేకుండా యదేచ్ఛగా జనావాసాల మధ్యనే కొనసాగిస్తున్నారు. టపాకాయల దుకాణాలు నిర్వహించేందుకు స్థానిక మున్సిపల్ మరియు పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి  కానీ ఒకటి రెండు దుకాణాలు మినహా గల్లి గల్లి కో వెలసిన టపాకాయల దుకాణం నిబంధనలు పాటించకుండానే కొనసాగిస్తున్నారు.

తాండూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఏకంగా భారీ గోదామునే ఏర్పాటు చేసుకొని హోల్సేల్ మరియు రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ యాదగిరి గత రెండు రోజుల క్రితం టపాకుల దుకాణ యజమానులతో సమావేశం నిర్వహించి నిబంధనలు తప్పనిసరి పాటించాలని హెచ్చరించినా కూడా వ్యాపారస్తులు అవి ఏమి పట్టించుకోవడం లేదు.

ఈ విషయమై స్థానిక అగ్నిమాపక శాఖ ఎస్సు జలంధర్ రెడ్డిని వివరణ కోరగా పట్టణంలో ఒకటి రెండు దుకాణాలు మినహా అనుమతులు లేవని.. ఇక టపాకుల దుకాణాల పర్యవేక్షణ సైతం తమ పరిధిలోకి రాదని తెలిపారు.