28-10-2025 12:00:00 AM
నేడు సిస్టర్ నివేదిత జయంతి :
మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ అంటే పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ‘సిస్టర్ నివేదిత’ అనగానే టక్కున గుర్తుప ట్టేస్తాం. ఐరిష్ వనిత అయినప్పటికీ మార్గరెట్ నోబెల్ భారతీయ ఆధ్యాత్మికతకు, జాతీయ భావానికి ఉప్పొంగిపోయారు. మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ 1867 అక్టోబర్ 28న ఐర్లాండ్‌లో జన్మించారు. తోటి మనుషుల ను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ అని తండ్రి శ్యా ముల్ రిముడ్ నోబెల్ చెప్పిన మాటలు మార్గరెట్‌ను చిన్నప్పుడే ప్రభావితం చేశాయి.
మార్గెరెట్ నోబెల్ క్రైస్తవ మతంలోని ఆంక్షల పట్ల అసహనం పెంచుకొని వ్యక్తి స్వాతంత్య్రాన్ని, ఆలోచనలను అదుపు చేయాలని కొత్త మతం కోసం అన్వేషణ సాగించారు. ఈ నేపథ్యంలో 1895లో లండన్ భార తీయ మహిళల ఔన్నత్యంపై స్వా మి వివేకానంద చేసిన ప్రసంగాలు మార్గెట్ హృదయాన్ని బలంగా తాకాయి. భారతీయ స్త్రీ ఔన్నత్యం గురించి వివేకానంద చెప్పిన తీరు కు ఆకర్షితురాలయ్యారు.
హిందూ మతాన్ని స్వీకరించేందుకు అంగీకరించిన మార్గరెట్‌కు స్వామి వివేకానంద 1898లో రామకృష్ణ మిషన్‌లో బ్రహ్మచర్యము దీక్షతో ‘నివేదిత’ అనే పేరును ఇచ్చారు. భారతీయ హిందూ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. సిస్టర్ నివేదిత స్వామి వివేకానందుని శిష్యురాలిగా మాత్రమే గాక, భారతదేశ సంస్కృతికి, విద్యకు, స్వాతంత్య్ర స్ఫూర్తికి అగ్నిశిఖగా నిలిచారు.
ఆమె తన జీవితాన్ని, ఆలోచనలను, ప్రతి అడుగునూ భరతమాత పాదాల చెంతనే ఉంచారు. వివేకానందుడి బోధనలు, వాటి ప్రభావాలను ‘ది మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ అనే పుస్తకంలో క్లుప్తంగా వివ రించారు. ఈ గ్రంథం గురుశిష్యుల అనుబంధానికి గొప్ప కావ్యంగా నిలిచిపోయింది.‘మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని నివేదిత ఉద్ఘాటించారు.
భారతదేశంలో బాలికల విద్యాభివృద్ధికి అత్యంత కృషి చేశారు. కలకత్తా వాసులకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు, ఆమె తన శిష్యులతో కలిసి వీధులను శుభ్రం చేయడం, వైద్యసేవలు అందించడంలో ముందున్నారు. తన నిస్వార్థ సేవతో ఆమె ‘లోకమాత’గా కీర్తించబడ్డారు. స్వామీజీ దేహ త్యాగం తర్వాత నివేదిత భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించి గోపాలకృష్ణ గోఖలే వంటి నాయకులతో కలిసి పనిచేసి జాతీయ వాదులకు స్ఫూర్తినిచ్చారు.
విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్, శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ వంటి ప్రముఖులతో స్నేహబంధాలు కొనసాగించిన సిస్టర్ నివేదిత వారికి ఆర్థిక, నైతిక మద్దతునిచ్చి జాతీయ ఆవిష్కరణలను ప్రోత్సహించారు. భారత మహిళల ఔన్నత్యం, ఆచార వ్యవహారాల గురించి ఆమె న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించి, భారతదేశం గౌరవాన్ని పెంచారు.
1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు, ఆమె బాధితులకు అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనది. ఒక విదేశీ మహిళ అయినప్పటికీ సిస్టర్ నివేదిత భారతీయ ఆత్మను పూర్తిగా అర్థం చేసుకుని హిందూ మతాన్ని స్వీకరించి ప్రజలను మేల్కొలపడానికి ఆమె జీవితాన్ని అంకితం చేశారు. సిస్టర్ నివేదిత ఆశయాలను కొనసాగిస్తూ విలువలను కాపాడడమే ఆమెకిచ్చే నివాళి.
దుప్పటి మొగిలి