calender_icon.png 16 October, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ హయాంలోనే ఓటరు జాబితా తారుమారు

16-10-2025 02:33:15 AM

-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల చోరీతోనే ఆ పార్టీ గెలిచింది 

-జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ సాకులు

-మంత్రుల మధ్య వివాదాలు మీడియా సృష్టే

-ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఓటర్ల జాబితాను తారుమారు చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. మంత్రుల మధ్య వివాదాలు మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. బుధవారం గాంధీభవన్‌లో మంత్రులతో ముఖా ముఖీ కార్యక్రమానికి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ అధికారంలో ఉందని, ఇప్పుడు ఓటరు జాబితాలో తప్పిదాలు జరిగాయని చెప్పడం చూస్తుంటే ఆ పార్టీ కూడా ఓటు చోరీకి పాల్పడినట్టుగా ఒప్పుకోవడమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్ల చోరీతోనే గెలిచిందని ఆరోపించారు. ఈ విషయంలో త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఓటు చోరీపై రాహుల్‌గాంధీ స్పష్టప మైన ఆధారాలు చూపించారని పేర్కొన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకన్నట్టు రాష్ట్రం లో కేటీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడిందని చెప్పిందే కాంగ్రెస్ అనే విషయం బీఆర్‌ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే బీఆర్‌ఎస్ నేతలు సాకులు వెతుకుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌నే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బస్తీ వాసులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పా రు. బీఆర్‌ఎస్ ఇప్పటికే ఓటమిని గ్రహించి.. ఏదో ఒక కారణాన్ని వెతుకుతోందన్నారు. 

నేను సిన్సియర్ కాంగ్రెస్ వాదిని 

కాంగ్రెస్ ప్రభుత్వానిదే రామరాజ్యమని, తెలంగాణలో ప్రజలందరూ రామరాజ్యాన్ని కోరుకోవడంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రు ల మధ్య జరుగుతున్న వాదాదాలపై మీడి యా ప్రశ్నించగా, రాష్ట్రంలో మంత్రుల మధ్య వివాదాలు లేవని, అది అంతా మీడి యా సృష్టేనని కొట్టిపారేశారు. ఎవరి శాఖలో వారు పని చేసుకుంటూ పాలన సాగిస్తున్నారని చెప్పారు. తాను సిన్సియర్ కాంగ్రెస్ వాదినని, తనకు నీచ రాజకీయం చేసే శక్తి లేదని, యుక్తి అంతకన్నా లేదని పేర్కొన్నా రు. తాను పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఇటు నుంచి అటు.. అటు నుంచి  నుంచి ఇటు పోయే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. పార్టీని బలోపేతం చేసే వ్యక్తినని పేర్కొన్నారు. పీసీసీ చేపట్టిన మంత్రులతో ముఖా ముఖీ కార్యక్రమంతో ప్రజల సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు.