ప్రతిష్ఠాత్మకంగా ఓటర్ల నమోదు
- మంత్రి శ్రీధర్‌బాబు దిశానిర్దేశం
- ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్ నేతలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహకసమావేశం
రంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం మైలార్‌దేవ్‌పల్లిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడాలని స్పష్టం చేశారు. అదే విధంగా అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యేలా బూత్ స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాత, కొత్త నాయకులు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
బీజేపి, బీఆర్‌ఎస్ పార్టీల వైఫల్యాలను, వారి అదృశ్య స్నేహాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని కోరారు. అభ్యర్థి ఎంపికను క్షేత్రస్థాయి పరిస్థితులు, నాయకుల అభిప్రాయాల ఆధారంగా అధిష్ఠానం ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపుడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.






