చెత్త తెస్తున్న చేటు!

06-05-2024 02:19:18 AM

పర్యావరణానికి ప్రమాదంగా మారిన వ్యర్థాలు

ఆధునిక జీవన శైలితో యూజ్ అండ్ త్రో కల్చర్

ఏటికేటికీ భారీగా పేరుకుపోతున్న ఘన వ్యర్థాలు

మున్సిపాలిటీల్లో సరిగ్గా లేని వ్యర్థాల నిర్వహణ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 224 కోట్ల టన్నుల వ్యర్థాలు

2050 నాటికి ఏటా 388 కోట్ల టన్నుల వ్యర్థాల పోగు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన వాటిలో ఘన వ్యర్థ కాలుష్యం ఒకటి. అభివృద్ధి, వస్తు వినియోగం, ఆహార వృథాతో వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఆధునిక జీవన శైలి అలవరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూజ్ అండ్ త్రో వస్తువుల వినియోగం పెరిగిపోవడంతో ఘన వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఈ సమస్య భారీగా పెరిగిపోతోంది. 

భారీగా వ్యర్థాల ఉత్పత్తి..

ప్రపంచవ్యాప్తంగా ఏటా 224 కోట్ల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇలాగే వ్యర్థాల ఉత్పత్తి కొనసాగితే 2050 నాటికి 388 కోట్ల టన్నుల వ్యర్థాలు ఏటా పోగవుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఏకంగా 45 శాతం వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పేరుకుపోయిన చెత్త.. ఇన్‌ఫెక్షన్లు పెరగడం, ప్లాస్టిక్ కాలుష్యం, గ్రీన్ హౌజ్ ఉద్గారాలు, వాతావరణ మార్పులు, పర్యావరణ నష్టం, జీవ వైవిధ్యం కోల్పోవడంతో పాటు విపరీతమైన కాలుష్యానికి దారి తీస్తుంది. వ్యర్థా నిర్వహణకు సంబంధించి సున్నా వ్యర్థాల దినోత్సవాన్ని ఏటా మార్చి 30న జరుపుకొంటారు. ఈ రోజున వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణహిత వ్యర్థాల ఉత్పత్తి, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 

భారత సంస్కృతిలో భాగమై..

పర్యావరణహితమైన జీవన విధానం భారతీయ సంస్కృతిలోనే ఇమిడి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కో వ్యక్తి సరాసరి ఉత్పత్తి చేసే కర్బన ఉద్గారాలు (పర్ క్యాపిటా కార్బన్ ఫుట్‌ప్రింట్) తక్కువగా ఉన్నాయి. పైగా పారిస్ ఒప్పందం ప్రకారం.. నేషనల్ డిటర్మైన్‌డ్ కంట్రిబ్యూషన్స్ ప్రకారం.. వాతావరణ మార్పులు, పర్యావరణహిత వినియోగం, ఉత్పత్తి జరిగేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 

పట్టణీకరణే దోషి..!

పట్టణాల్లో సున్నా వ్యర్థాల దిశగా సాగేందుకు ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. దీనంతటికీ కారణం.. వేగంగా పట్టణీకరణ చెందడం, ఆర్థిక అభివృద్ధి, పట్టణాల్లో వినియోగం భారీగా పెరిగిపోవడమే.. అందుకు భారతదేశంలోని నగరాలు, పట్టణాల్లో సున్న వ్యర్థాల దిశగా వెళ్లేందుకు అనేక కారణాలు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొత్తం సమాజం కలిసికట్టుగా కృషి చేస్తే సులువుగా సాధ్యం అవుతుంది.

స్థానిక సంస్థల పాత్ర..

భారతదేశంలో వ్యర్థాల నిర్వహణ సాధారణంగా రాష్ట్రాల జాబితాలో ఉంది. సున్నా వ్యర్థాల ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధించడంలో రాష్ట్ర, పట్టణ స్థాయి పరిపాలన వ్యవస్థలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. కేంద్రంలోని విధానాలను, అంతర్జాతీయ పాలసీలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలు పాలసీలను రూపొం దించగలిగితే సున్నా వ్యర్థాల లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.

మహిళలు, యువతే కీలకం..

పట్టణప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణకు మహిళలు, యువత ఎంతో కీలకం. వీరికి అవగాహన కల్పిస్తే.. మిగతావారికి ఆదర్శంగా నిలవడమే కాకుండా పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టేలా సమాజాన్ని ముందుకు నడుపుతారు. డిజిటల్ సేవలు కూడా అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా కూడా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించే అవకాశం ఉంటుంది. సున్నా వ్యర్థాలు ఉత్పత్తి చేసేలా పరిశ్రమలను, మార్కెట్ వర్గాలను ప్రేరేపిస్తే మెల్లగా సుస్థిరత దిశగా ఆర్థిక కార్యకలాపాలు నడిపించవచ్చు. ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం దగ్గరి నుంచి వాటిని సురక్షితంగా పడేసేలా పర్యావరణహితంగా ఉండేలా చర్యలు తీసుకుఓవాలి. పరిశోధనలు, కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఎక్కువ పెట్టుబడులు ప్రోత్సహిస్తే వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్నో మార్పులు చూడవచ్చు. అది చివరకు సర్క్యులర్ ఎకానమీ దిశగా దేశం దూసుకెళ్తుంది.

కేంద్రం చర్యలు..

సర్క్యులర్ ఎకానమీ సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక కార్యమ్రాలను తీసుకొచ్చింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, ఈఝైవేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, భవన నిర్మాణాల వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, మెటల్స్ రీసైక్లింగ్ పాలసీ కేంద్రం తీసుకున్న చర్యల్లో కొన్ని. అయితే మన దేశంలోని సంప్రదాయాలను ప్రస్తుతం అమల వుతున్న కార్యక్రమాలు  అంతగా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. దేశంలోని 4,715 నగరాలను చెత్త రహిత నగరాలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. చెత్తను వేరు చేయడం, డంప్ యార్డుల సమర్థ నిర్వహణ, చెత్త నిర్వహణలో మహిళలు, యువత భాగస్వాములయ్యేలా చేసి ప్రపంచదేశాల సరసన నిలవాలని భారత్ నిర్ణయించింది.