26-07-2025 12:41:55 AM
-పంటల సాగుకు జీవం
-అన్నదాతల ఆనందం
మహబూబాబాద్, జూలై 25 (విజయ క్రాంతి): వర్షాకాలం ప్రారంభమై ఇంచుమించు రెండు నెలలు కావస్తున్నా ఆశించిన వర్షాలు కురవకపోవడంతో వానకాలం పంటల సాగుపై అన్నదాతలు నాలుగు రోజుల క్రితం వరకు దిగులు చెందారు. అయితే మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకోవడంతో ఇక వానాకాలం పంటల సాగుకు జీవం పోసినట్లేనని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా చెరువుల్లోకి కుంటలు సగానికి పైగా వరద నీకు చేరింది. జిల్లావ్యాప్తంగా 1,590 చెరువులు, కుంటలు ఉండగా వందకు పైగా చెరువులు కుంటలు పూర్తిస్థాయిలో నిండి మత్తడి పోస్తున్నాయి. సుమారు 500 చెరువుల్లోకి 50 శాతం నీటిమట్టంతో, మరో 500 చెరువులు 75 శాతం నిండాయి.
జిల్లాలో ప్రధాన జలాశయాలుగా పేరుగాంచిన బయ్యారం పెద్ద చెరువు, తులారం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరడంతో మత్తడి పోస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చేస్తున్న ప్రకటనలతో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు దాదాపు పూర్తిస్థాయిలో వరద నీరు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాకాలం పంటల సాగుకు తోడ్పాటుగా మారిందని అన్నదాతలు చెబుతున్నారు.
ఇప్పటికే వానాకాలం పంటల సాగులో భాగంగా లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నాటిన పత్తి, మొక్కజొన్న, ఇతర పునాస పంటలకు వర్షాలు జీవం పోసాయని చెబుతున్నారు. వానాకాలం పంటల సాగులో భాగంగా మరో మూడు లక్షల ఎకరాల్లో పంటల సాగు చేపట్టాల్సి ఉంది.
ఆశించినంతగా కురిసిన వర్షాలతో తాజాగా వరి సాగు పనులు మరింత ముమ్మరం చేసే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వరి నారు పోసి వర్షాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో ఆశించిన మేర వర్షాలు కురవడంతో వరి సాగుకు కరిగట్టు, నాట్లు వేసే పనులు జోరు అందుకున్నాయి. వర్షాలతో మహబూబాబాద్ జిల్లా కరువు ఛాయాల నుంచి దాదాపు బయటపడిందని పేర్కొంటున్నారు.