calender_icon.png 3 January, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని కమ్మేసిన పొగమంచు

03-01-2026 12:18:07 AM

  1. రైళ్లు, విమానాలు, వాహనాల రాకపోకలకు ఆటంకం

100 మీటర్ల దూరం వరకు కూడా కనిపించని పరిస్థితి

ప్రత్యేకమైన ఫాగ్ డివైజ్, లాంగ్ హారన్‌తో నడిసిన రైళ్లు

శుక్రవారం తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు కురిసిన మంచు

అనేక జిల్లాలో అటు చలితీవ్రత, ఇటు పొగమంచు ఉధృతి

ఇబ్బందులు పడ్డ ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు

“తెంగాణ రాష్ట్రాన్ని పొగమంచు కమ్మేసింది. మంచుకౌగిళిలో జిల్లాలన్నీ గజగజా వణికిపోయాయి. రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, వాహనాలు, పంటపొలాలు, పల్లెలు, పట్టణాలు, నగరాలు సైతం మంచుతో కప్పేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్ముకున్నది. పొగమంచు ఉధృతికి ఇటు మనుషులేకాదు.. అటు యంత్రాలు సైతం కొన్నిగంటల పాటు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

మహబూబాబాద్/ హుజురాబాద్/ ఆసిఫాబాద్/ అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 2 (విజయక్రాంతి): రాష్టప్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు ఉధృతి వల్ల రైళ్లు, విమానాలు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. 100 మీటర్ల దూరం వరకు కూడా కన్పించకపోవడంతో రైళ్లు ప్ర త్యేకమైన ఫాగ్ డివైజ్, లాంగ్ హారన్‌తో నడిసాయి. వాహనాలు లైట్లు వేసుకుని, నెమ్మ దిగా సాగాయి.

ప్రజలు, విద్యార్థులు, రైతు లు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగా రెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల లో పొగమంచు కమ్మేసింది.  ఉమ్మడి వరంగల్ జిల్లాను శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాల్లో రైళ్లు, వా హనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

హిమపాతం వల్ల కనీసం 100 మీటర్ల దూ రం వరకు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనాలను వేగం తగ్గించి నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రైళ్లను ప్రత్యేకమైన ఫాగ్ డివైజ్ ఆధారంగా, లాంగ్ హారన్ మోగిస్తూ నడిపారు. పొగమంచు ఉధృతి తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు కొనసాగింది. అటు చలితీవ్రత, ఇటు పొగమంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

హుజురాబాద్‌ను బంధించిన మంచుదుప్పటి!

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు తేరుకోకపోవడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హుజురాబాద్‌తో పాటు జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాలను దట్టమైన మంచు కప్పేసింది. రెండు రోజుల నుంచి పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉన్నా శుక్రవారం మరింత పెరగడంతో చలి మరింత తీవ్రమైంది.

దీంతో ఉదయం పనులకు వెళ్లే ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయం 9 గంటలు దాటినా సామాన్య ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సాహసం చేయలేకపోయారు. పొగమంచు వల్ల ఆవిష్కృతమైన అరుదైన దృశ్యాలు సమీపంలో కనిపించాయి. 

ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం కనువిందు

ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా పొగమంచుతో కమ్ముకున్నది. ఉదయం 9.30 వరకు పొగమంచు వీడలేదు.    దీంతో ప్రజలు, రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంచుతెరలతో గ్రామాలు, పంట పొలాలు, రోడ్లు, రహదారులు అరుదైన అందాలను సంతరించుకుని కనువిందు చేశాయి.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో 9 గంటలైనా కురిసిన మంచు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో ఆయా గ్రామాలలో పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 9 గంటలు దాటినా దట్టంగా మంచు కురిసింది. దీంతో మండల పరిధిలోని తట్టి అన్నారం, కుంట్లూరు, గౌరెల్లి, పసుమాముల తదితర గ్రామాలను మంచుపొగ కమ్మేసింది.

అలాగే హైదరాబాద్-, విజయవాడ జాతీయ రహదారి పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్, ఇనామ్‌గూడ, బాటసింగారం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పొగమంచుతో రోడ్లు కనిపించకపోవడంతో వాహనాలు లైట్లు వేసుకుని మెల్లగా కదిలాయి. పొగమంచు వల్ల శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అనేక విమానాలు రద్దు అయ్యాయి. 9:30 గంటల తర్వాత సూర్యుడు మెల్లగా దర్శనం ఇచ్చాడు. రహదారులు పంట పొలాల్లో ఎక్కడ చూసినా పొగమంచు పరుచుకొని అందమైన దృశ్యాలు కనువిందు చేశాయి.