25-09-2025 01:14:30 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): బీసీ వాటా పోరాటంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమాలతో ప్రజల్లో అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓట్ చోరీతోనే బీజేపీ మూడోసారి గెలించిందన్న ప్రజలు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఓట్ చోరీ ఉద్యమంతో కాంగ్రెస్ నైతికంగా విజయం సాధించిందన్నారు.
ఓట్ చోరీ, బీసీలకు వాటా ఉద్యమాలతో ప్రజల్లో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. పకడ్బందీగా సాక్ష్యాలతో రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ మీద, బీజేపీ మీద వేసిన ఓట్ చోరీ బాంబులు బాగా పేలాయని, ఎన్నికల కమిషన్ అక్రమాలతోనే బీజేపీ అక్రమ మార్గంలో మూడోసారి గెలించిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం సమాజంలో ఎవరి వాటా ప్రకారం వాళ్లు లబ్ది పొందాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అనేకసార్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అనేక చర్యలు తీసుకున్నామని, బీసీలకు విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుందన్నారు.