calender_icon.png 7 September, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు ప్రగతికి కట్టుబడి ఉన్నాం

04-09-2025 01:15:51 AM

-జిల్లాను పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతాం..

-తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తాం..

-కల్వకుంట్ల కుటుంబంలో వాటాల పంచాయితీ

-మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. 

-నేను ఎవరి వెనుకా లేను.. ఉంటే ముందే ఉంటా..

-బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి చురకలు

-మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్జీడీ ఫార్మాస్యూటికల్ రెండో యూనిట్ ప్రారంభోత్సవం

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ‘పాలమూరు’ ప్రగతికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని, ఉమ్మడి జిల్లాను పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మహబూబ్‌న గర్ జిల్లా మూసాపేట మండలంలోని వే ముల గ్రామంలో బుధవారం ఆయన మం త్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర శాసనసభ్యుడు జీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఎస్జీడీ కార్నింగ్ ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబింగ్ జాయింట్ వెంచర్ ఫర్నేస్ లైటింగ్ రెండో యూనిట్‌ను ప్రారంభించి మాట్లాడారు.

విద్య, వైద్య, సాగునీటి రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు.  ఒకప్పుడు పాలమూరు జిల్లా  వలసలకు మారుపేరుగా ఉండేదని, పేదరికం, వలస సమస్యలను చూపించేందుకు ప్రపంచస్థాయి నేతలను నాటి పాలకులు ఇక్కడికే పంపించేవారని గుర్తుచేశారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం వర్సిటీలు, సాగునీ టి ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలను చూపించేందు కు దేశ విదేశాల పర్యాటకులను ఆహ్వానిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు విద్యగా దూరంగాఉండడం, పంటలకు సాగునీరు  అందుబాటులో లేకపోవ డం వల్లే కరువు పరిస్థితులు ఉండేవని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టు పనులు ఇప్పటి అసంపూర్తిగా ఉన్నాయన్నారు.

నాడు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ  పాలమూరు వర్సిటీని మంజూరు చేసినప్పటికీ, అది కేవలం పీజీ కాలేజీగానే మిగిలిపోయిందని వాపోయారు. విద్య తలరాతను మార్చే ఆయుధమన్నారు. పాలమూరు బిడ్డలు చక్కగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, తమ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గం లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామన్నారు.

ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 14 అడ్వాన్స్ ట్రైనింగ్ సెం టర్లు ఏర్పాటు చేస్తామని, తద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థు లు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునేవిధంగా నైపుణ్య శిక్షణ  ఇస్తామన్నారు. ఇక్కడి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లే కాదు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వా రా నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు అన్యాయం చేయమని, భూసేకరణ విషయంలో రైతులతో మాట్లాడి, వారిని ఒప్పించి మంచి పరిహారం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు

మీ గొడవలోకి మమ్మల్ని లాగొద్దు..

బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నాడని కొందరు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవితను ఉద్దేశిస్తూ సీఎం వ్యాఖ్యలు చేశారు. తాను ఉంటే ముందే ఉంటానని, ఎవరి వెనుకా ఉండనని చమత్కరించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనక తానెందుకు ఉంటానని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి ఎద్దేవా చూశారు. ‘మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు’ అని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. కల్వకుంట్ల కుటుంబంలో దోచుకున్న సొమ్ము, దాచుకున్న సొమ్ము పంపకాల్లో ఒకరిని ఒకరు సహించుకోలేని పరిస్థితి వచ్చిందని, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని దుయ్యబట్టా రు.

గతంలో ఇతర పార్టీలనున రాజకీయం గా బతకనివ్వకుండా, అనవసరమైన కేసులు పెట్టివారు ఇప్పుడు, వాళ్లలో వాళ్లే తన్నుకు చస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాకు ఏ మేలూ జరగలేదన్నారు. ఒక ప్రాజెక్టునా పూర్తి కాలేదన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తొక్కి పట్టారని ఆరోపించారు. ప్రజల కు మంచి చేయాలని తపన మనసులో ఉం డాలని కేవలం మైకుల ముందు చెబుతూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. మాయమాటలు చెప్పడంలో బీఆర్‌ఎస్ నేతల దిట్టలు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి సంవత్సరానికి రూ.20 వేల కోట్లు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారని, అందరూ మెచ్చేలా అభివృద్ధి చేసుకుందామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

కురుమూర్తి దేవస్థానానికి వెళ్లేందుకు సర్కా ర్  ఘాట్ నిర్మిస్తుందని, అందుకు రూ.110 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గాన్ని పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిది ద్దాలని సీఎంను కోరారు. నియోజకవర్గంలో బ్రహ్మోస్ మిస్సుల్ తయారీకి కంపెనీ వ్యవస్థాపకులతో మాట్లాడి, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీకి 30 కోట్లు మం జూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా కొత్తకోట మున్సిపాలిటీకి ఒక డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆబ్కారీ, పర్యా టక సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్ర ణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, వనపర్తి ఎమ్మె ల్యే తూడి మేఘారెడ్డి, నారాయణపేట ఎమ్మె ల్యే పర్ణికారెడ్డి, షాద్‌గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏనుగు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.