calender_icon.png 9 May, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం

09-05-2025 02:32:36 AM

ప్రకటించిన భారత రక్షణ శాఖ l ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని వెల్లడి

న్యూఢిల్లీ, మే 8: జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న కీలక సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు యత్నించగా, భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ సామాజిక మాధ్య మం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సం భవించలేదని స్పష్టం చేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు  యత్నించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.

శత్రువుల నుంచి ముప్పును పసిగట్టిన వెంటనే భారత సైన్యం నిర్దేశిత కార్యచరణ నిబంధనలకు అనుగుణంగా ప్రతిస్పందించిందని తెలిపింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ మధ్య పాక్ ప్రయోగించిన 8 మిసైళ్లను కూల్చినట్టు రక్షణ శాఖ తెలిపింది. సరిహద్దుల్లో ఎలాంటి దుందుడుకు చర్యలనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని రక్షణ వర్గాలు వ్యాఖ్యానించాయి.

అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్టు, అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్టు రక్షణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. రాజస్థాన్‌లోని జైసల్మెర్, బికనీర్ సరిహద్దు వద్ద భారత గగనతలంలోకి దూసుకొచ్చిన పాక్ మిసైల్స్‌ను అప్పటికప్పుడే కూల్చినట్టు తెలిపింది.