calender_icon.png 25 September, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంసిద్ధం కావాలి

25-09-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : అక్టోబర్ మొదటి వారంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో 2025- 26 వానాకాలం ధాన్యం కొనుగోలుపై సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలంకు సంబంధించి గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధరను ప్రకటించిందన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ను సైతం వెల్లడించిందన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా పది లక్షల 30 వేల 868 మెట్రిక్ టన్నుల దాన్యం ఉత్పత్తి రాగలదని, కావున ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 4,30,880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను ఆయన ఆదేశించారు.

తక్కిన ధాన్యాన్ని మిల్లర్లు, ట్రేడర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు.  అక్టోబర్ 20 నుంచి ధాన్యం వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఐకెపి, పిఎసిఎస్, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులకు సూచించారు. ధాన్యం రవాణాకు ఎలాంటి సమస్య రాకుండా ట్రాన్స్పోర్ట్, కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను వెహికల్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు.

రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా ముందే అవగాహన కల్పించాలని చెప్పారు. అదేవిధంగా పత్తి కొనుగోలు లోను ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, పౌరసరఫరాల జిల్లా అధికారి మోహన్ బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డిఆర్డిఓ అప్పారావు, జిల్లా కోపరేటివ్ అధికారి పద్మ , జిల్లా మార్కెటింగ్ అధికారి సతీష్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వి .మధు, లీగల్ మెట్రోలజీ అధికారి చిట్టిబాబు, ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రకాష్ రెడ్డి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.