11-05-2025 12:00:00 AM
‘చాలాసార్లు మనకు రెగ్యులర్ పాత్రలే వస్తుంటాయి. రైటర్స్ కొత్త ఆలోచనలతో వస్తేనే కామెడీ పాత్రలు కూడా కొత్తగా వస్తాయి’ అంటున్నారు నటుడు వెన్నెల కిశోర్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారాయన.
కార్తీక్‌రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో కిశోర్ విలేకరులతో ముచ్చటించారు. “-మనం చికెన్ బిర్యానీ తిన్నప్పుడు ఎప్పుడో ఓసారి లివర్ పీస్ వస్తుంది. అది బిర్యానీకి మరింత టేస్ట్‌ను తీసుకొచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. సింగిల్’లో నా క్యారెక్టర్ కూడా అలాంటిదే (నవ్వుతూ).
ఏదేమైనా ఈ సినిమాలో సెకండ్ హీరో నేనే అనే టాక్ రావడం ఆనందంగా ఉంది. కామెడీ పాత్రలను ఎంచుకునే పరిస్థితి ఇప్పుడు ఉండటంలేదు. అందుకే అన్నిటికన్నా ముందు మనం రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైటర్స్ కొత్త ఆలోచనలతో అంతటి సామర్థ్యం ఉన్న కథలతో వస్తేనే కామెడీ పాత్రలు కూడా కొత్తగా వస్తాయి.
చాలాసార్లు మనకు రెగ్యులర్ పాత్రలే వస్తుంటాయి. నేను కథను ఓన్ చేసుకొని, ఒక యూనిక్‌నెస్‌ను ప్రజెంట్ చేసేలా ప్రయత్నం చేస్తుంటా. నావల్ల ఒక సీన్ ముందుకెళ్లడం నాకు గొప్ప ఆనందాన్నిస్తుంది. -మనది కాని ఒక ప్రపంచంలోకి ప్రవేశించి అక్కడ అలరించే పాత్రలు చేయడం నాకిష్టం.
ఉదాహరణకు ‘గీతగోవిందం’, ‘అమీతుమీ’ చిత్రాల్లో చేసిన పాత్రలు నాకు బాగా ఇష్టం. ఈ కాలంలో కామెడీ పండించడం సవాలుతో కూడుకున్నది. ఇప్పుడు కంటెంట్ విపరీతంగా అన్ని ప్లాట్‌ఫాంలలోనూ ఉంది. రీల్స్ ఓపెన్ చేస్తేనే బోలెడు కామెడీ వీడియోలు కనిపిస్తాయి. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేయాలంటే అంతకుమించి ఇవ్వగలగాలి.
అలాంటి క్యారెక్టర్ కుదరాలి. అవన్నీ కుదరడం వెరీ బిగ్ చాలెంజ్. నేను థ్రిల్లర్స్ ఇష్టపడతాను. బ్రహ్మానందం ఓ సందర్భంలో నేను తన వారసుడని చెప్పారు. ఆయన నాపై ప్రేమతో అన్నమాట. ఏదో నాకు కొంత బూస్టప్ ఇవ్వడానికి ఆ మాట అభిమానంతో చెప్పిందే. -నాకు డ్రీమ్‌రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు. దూకుడు సినిమా తర్వాతే నా డ్రీమ్ రోల్ అయిపోయింది.
మహేశ్‌బాబు పక్కన అంత మంచి క్యారెక్టర్ చేయడం నిజంగా డ్రీమ్‌రోల్. ఇప్పుడు చేస్తుందంతా బోనస్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. అయితే నాకు జీవితాంతం గుర్తుండిపోయే పాత్రలు మాత్రం వెన్నెల, బిందాస్, దూకుడు. చార్లీ సినిమా తర్వాత మళ్లీ హీరోగా సినిమా చేయలేదు. హీరోగా చేయాలనే ఆలోచనతో ఉన్నా. అందుకే కథలూ ఇంటున్నా. అయితే అందులో లవ్‌స్టోరీ, పాటలు అంటున్నారు. అవి నాకు అంతగా సూట్ కావు. ప్రాపర్ కామెడీ కథ కుదిరితే తప్పకుండా చేస్తా.