calender_icon.png 5 August, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

05-08-2025 12:44:23 AM

  1. క్యాన్సర్ రోగులను ఆర్థికంగా ఆదుకుంటా

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

కొండాపూర్, ఆగస్టు 4 :  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని వెంకటేశ్వర గార్డెన్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ  ఆగస్టు 7న తన కూతురు జయారెడ్డి వివాహానికి మండలంలోని కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు. 

రాబోయే స్థానిక ఎన్నికల్లో నాలుగు జెడ్పిటిసిలు, నాలుగు ఎంపీపీలు, రెండు మున్సిపల్ చైర్మన్ లు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు.

క్యాన్సర్ రోగులను ఆర్థికంగా ఆదుకుంటానని, అలాగే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పాలై వైద్య ఖర్చులకు ఆర్థికంగా లేనట్లయితే వారికి అండగా ఉండి ఆర్థిక సహాయం చేస్తానని, అలాగే కార్యకర్తల ఆడపడుచుల వివాహ ఖర్చులకు ఆర్థికంగా అండగా ఉంటానని హామీనిచ్చారు. 

కన్నీళ్లు పెట్టుకున్న జగ్గారెడ్డి...

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సమావేశాన్ని సంగారెడ్డిలో గ్రాండ్ గా నిర్వహించిన సందర్భాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేవని, కష్టకాలంలో పార్టీ నాయకుడు ఆంజనేయులు తన భూమిని అమ్మి డబ్బు సహాయం చేశాడని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడు జోష్ గా నవ్వుతూ, మంచి ఉత్సాహంగా ఉండే జగ్గారెడ్డి కన్నీరు పెట్టుకోవడంతో పార్టీ నాయకులు,

కార్యకర్తలు అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కొండాపూర్ మాజీ ఎంపిటిసి నరసింహారెడ్డి, మారేపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశం గౌడ్, కొండాపూర్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.