28-01-2026 12:56:54 AM
దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం
మధిర నియోజకవర్గ పరిధిలో దివ్యాoగులకు రిట్రోఫిటెడ్ మోటారు వాహనాల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం
ఎర్రుపాలెం జనవరి 27 ( విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం పదేళ్ళలో చేయలేని పనులని, ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, అందులో భాగంగానే ఈ రెండేళ్లలో దివ్యాంగుల కోసం 100 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. చదువుకుంటున్న దివ్యాం గులకు ఐపాడ్లు, కంప్యూటర్లు ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమది ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వమని అన్నారు. దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని, వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.
దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, దివ్యాంగుల గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. సమాజంలో ఇతరులు కన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలని అన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఇర్రిగేషన్ ఎస్‌ఇ వాసంతి, విద్యుత్ ఎస్‌ఇ శ్రీనివాస చారి, ఆర్ అండ్ ఎస్‌ఇ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కె ట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవ సాయ శాఖ ఏడి విజయ చందర్, మధిర తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.