20-09-2025 12:52:47 AM
దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం ప్రధాన కార్యనిర్వాహణాధికారి ఐ గోపీనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): దేశప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు లభించాలన్న సదుద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన జీఎస్టీ ఆర్థిక సంస్కరణలను స్వాగతిస్తున్నట్టు దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం ప్రధాన కార్యనిర్వాహణాధికారి ఐ గోపీనాథ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ..‘సకాలంలో తీసుకున్న, పురోగమన నిర్ణయం వినియోగదారులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక ముందడుగు వేసినట్టు అవుతుంది. వివిధ రంగాల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకూ పరిష్కారం లభించినట్టవుతుంది. సిమెంట్‌పై ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల గృహ నిర్మాణ రంగం అత్యంత వేగంగా పురోభివృద్ధి చెందుతుంది.
దీని వల్ల అనేక మంది సామాన్యు లకు సరసమైన ధరల్లో గృహనిర్మాణాలు పూర్తి చేసుకొని వెసులుబాటు ఉంటుంది. సిమెంట్ ధర తగ్గింపు వల్ల ‘అందరికీ గృహ నిర్మాణం’ అన్న మిషన్‌కు మద్దతు లభించినట్టు అవుతుంది. పట్టణ, గ్రామీణ భారత దేశం సమతౌల్య అభివృద్ధితో ముందుకు సాగుతాయి. సవరించిన ధరలు నిర్మాణ రంగం డిమాండ్‌ను పెంచడమే కాకుండా.. పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది.
ఉపాధిని సైతం సృష్టిస్తుంది. ఈ సంస్కరణల్లో సిమెంట్‌ను చేర్చడం దేశ నిర్మాణ రంగంలో దాని కీలకపాత్రను ప్రతిబింబిస్తుంది. దక్షిణ భారత దేశంలోని ప్రముఖ సిమెంట్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్‌ఐసీఎంఏ సభ్యులు ఈ సంస్కరణను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు’ అని పేర్కొన్నారు.