12-10-2025 02:25:30 PM
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. దామోదర్ రెడ్డి 10వ రోజు సంతాపసభలో ముఖ్మమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటంబానికి ముఖ్మయంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దామన్న వేల ఎకరాల భూమిని నల్గొండ ప్రజల కోసం త్యాగం చేశారు.
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఆయన నిలబెట్టారని, గోదావరి జలాలను నల్గొండకు తేవడానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును తీసుకొచ్చారని తెలిపారు. దామన్న ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రజల కోసం పనిచేశారని ఆయన స్పష్టం చేశారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచింది అంటే రాంరెడ్డి దామోదర్ రెడ్డి వల్లే అని, ఆయన కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇచ్చి కాంగ్రెస్ అధిష్ఠానం అండగా ఉంటుందని మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని సీఎం వ్యాఖ్యానించారు. నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని, ఎస్ఆర్ఎస్పీకి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీ-2కి ఆర్డీఆర్ ప్రాజెక్టుగా మారుస్తూ 24 గంటల్లో జీవో ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.