12-10-2025 03:21:06 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక నవంబర్ 11న జరుగనుంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచారం ముమ్మరం అవుతోంది. ఈ నేపథ్యంలో షేక్ పేట డివిజన్ కు చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీకు కారు కావాలో బుల్డోజర్ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుందని, తెలంగాణకు పనికిరాని పార్టీ బీజేపీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని వ్యంగ్యంగా మాట్లాడారు. బీఆర్ఎస్ జయత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని, కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే వృద్ధులకు రూ.4 వేల పింఛన్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అన్నీ తెలిసి బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, పార్లమెంట్ లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని రేవంత్ రెడ్డికి తెలుసాని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల జీవో నంబర్ 9ను కోర్టు కొట్టేస్తుందని తెలిసి సీఎం బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత జూబ్లీహిల్ ఉపఎన్నికల్లో ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అవకాశం కాల్పించింది. మాగంటి గోపీనాథ్ సతిమణి మాగంటి సునీతను ప్రకటిస్తూ, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.