calender_icon.png 23 January, 2026 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ లేఖల్లా సిట్ నోటీసులు!

23-01-2026 01:08:55 AM

ఎన్నిచ్చినా బెదరం..

హామీలు అమలయ్యేదాకా వదలం

ప్రజాపాలనలో క్రాప్ హాలిడే 

ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ పీఠాలను క్లీన్ స్వీప్ చేస్తాం 

మాజీ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి/మెదక్, జనవరి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రేమ లేఖల్లాగా సిట్ నోటీసులు ఇస్తున్నారని, ఎన్ని నోటీసులు ఇచ్చినా బెదరబోమని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టబోమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనకు, కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఎన్ని నోటీసు లు ఇచ్చినా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నిన్ను వదిలిపెట్టబోమన్నారు. దశాబ్దాల మెదక్ జిల్లా కలను సాకారం చేసి అభివృద్ధి పథంలో కేసీఆర్ నడిపిస్తే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మెదక్‌ను ఆగం చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. ఇందిరా గాంధీ హయాం నుంచి 40 ఏళ్లుగా మెదక్ జిల్లా గురించి కాంగ్రెస్ పార్టీ ఊరించింది తప్పా జిల్లాను చేయలేదని, కేసీఆర్ మాట ఇచ్చి మెదక్‌ను జిల్లాగా చేసి చూపించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండే ళ్లయినా మెదక్ అభివృద్ధి కోసం చేసిన ఒక్క పనిని చూపించగలరా? అని ప్రశ్నించారు. ఘనపురం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి తీసుకొచ్చారన్నారు.

కేసీఆర్ రైతుబంధు నిధులు నాట్లకు ఇస్తే.. రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే ఇస్తున్నారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 62, 500 బాకీ పడ్డారని, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చీరలు పంచుతుంటే మహాలక్ష్మి పైసలు ఎప్పుడు ఇస్తావ్ అని మహిళలు నిలదీశారని ఎద్దేవా చేశారు. మంత్రి వివేక్ చెన్నూరులో పర్యటిస్తుంటే ఈ రోడ్డు ఎట్లుంది? వీధి దీపాలు ఇవ్వమని ప్రజలు తిరగబడ్డారని, మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి, హైదరాబాదులో పొన్నం ప్రభాకర్‌ను నిలదీశారని తెలిపారు. 

కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లా రద్దే

మెదక్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే జిల్లాను రద్దు చేసుకోవడమేనని హరీశ్‌రావు చెప్పారు. రేవంత్‌రెడ్డి మెదక్ జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా జిల్లాగానే ఉండాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించి రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలన్నారు. ఎవరు గెలుస్తారో వారికే టికెట్లు ఇస్తానని, రాబోయే రెండేళ్లలో వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోమున్సిపల్ పీఠాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, మాజీ ము న్సిపల్ చైర్మన్లు మల్లిఖార్జున్‌గౌడ్, కొండన్ సావిత్రి, నాయకులు తిరుపతిరెడ్డి, బట్టి జగపతి, కొండన్ సురేందర్‌గౌడ్, పల్లె జితేం దర్‌గౌడ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమాగం

కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు మం డిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలపై విసిగిపోయి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. గురువారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి హరీశ్ రావు నివాసంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెంది న పలువురు కీలక నాయకులు భారీ సంఖ్య లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్ చెరు బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు. దీంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, చెత్త ఎత్తడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుధ్యం లోపించిందని, దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, స్ట్రీట్ లైట్లు వెలిగే పరిస్థితి లేదు, తాగునీటి సరఫరాలో కూడా కోతలు విధిస్తున్నారని తెలిపారు. ఇస్నాపూర్, గుమ్మడిదల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

స్కాములపై సమాధానం చెప్పే దమ్ములేకనే నోటీసుల డ్రామా

బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్‌రెడ్డి నోటీసుల డ్రామా ఆడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాముల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇచ్చారని, రేవంత్‌రెడ్డి బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డి గుర్తుపెట్టుకో.. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం. దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే’నని స్పష్టం చేశారు. ‘మీరు బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. మేం ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిలబడి నిన్ను నిలదీస్తున్నాం.

మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్‌ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే. కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి’ అని హితవు పలికారు. ‘ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా నిన్ను, నీ పార్టీని వదిలిపెట్టబోం’అని హెచ్చరించారు. ‘మీ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు’ అని వెల్లడించారు.