24-07-2024 01:43:49 AM
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అనుసరించిన విధానం, దర్యాప్తు తీరు తదితర వివరాలను కోర్టు ముందు ఉంచుతామని పేర్కొన్నది. ఈ కేసులో పోలీసు కమిషనర్ వేసిన కౌంటర్‌లోని అంశాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేస్తుందని తెలిపింది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టిన విషయం విధితమే.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ .వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ కమిషనర్ పేర్కొన్న అంశాలకే పరిమితం కాకుండా, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనుసరించిన విధానంసహా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కావాలని కోరారు. కేంద్రం తరఫున కౌంటరు దాఖలు చేయడానికి ౩ వారాల గడువు కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ విజ్ఞప్తిచేశారు. దీంతో ధర్మాసనం కేసు విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.