calender_icon.png 11 July, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణిచివేస్తాం

10-07-2025 06:21:22 PM

బెల్లంపల్లి ఏసిపి ఎన్ రవికుమార్..

మందమర్రి (విజయక్రాంతి): యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస కావద్దని సమాజంలో గంజాయి, మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తామని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్(ACP Ravikumar) స్పష్టం చేశారు. నేర రహిత సమాజ స్థాపనలో భాగంగా పట్టణంలోని విద్యానగర్, చెంచు కాలనీలలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ షీటర్లు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహక శక్తుల ఇళ్లపై ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పాత నేరస్తులు, పదే పదే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, యువతను తప్పుదోవ పట్టించే గంజాయి అమ్మకం, రవాణా, వినియోగం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడమే పోలీస్ శాఖ లక్ష్యం అని అన్నారు. ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకాన్ని ప్రోత్సహించినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం కాలనీలో పర్యటించి ప్రతి షీటర్ ఇంటికి వ్యక్తిగతంగా వెళ్లి వారి జీవన శైలిని, ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. "గతాన్ని వదిలిపెట్టి, మంచిగా బతకి సమాజంలో గౌరవ ప్రదమైన జీవితం గడపాలని, మీ పిల్లల బంగారు భవిష్యత్తు ను నాశనం చేయవద్దని సూచించారు. పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి, నేర ప్రవృత్తిని పునరావృతం చేస్తే, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పాత బస్టాండ్ జయ శంకర్ చౌరస్తాలో పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 'నాకాబందీ' నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అదేవిధంగా, కార్లకు పరిమితికి మించి అమర్చిన బ్లాక్ ఫిల్మ్‌ లను తొలగించి, యజమానులకు జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్, దేవపూర్ ఎస్సై ఆంజనేయులు, అదనపు ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు.