30-10-2025 12:23:24 AM
 
							కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, అక్టోబర్ 29(విజయక్రాంతి) : మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం ఆమె భారీ వర్షాల నేపథ్యంలో దేవరకొండ డివిజన్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలో ఉన్న షెడ్యూల్ తెగల బాలుర హాస్టల్లోకి వర్షపు నీరు చేరడం పట్ల విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తు ఉండడం, కొమ్మే పల్లి ఎస్ టి వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో ఉండడం వంటి కారణాల వల్ల హాస్టల్లోకి నీరు ప్రవేశించిందని తెలిపారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో విద్యార్థులను పక్కనే ఉన్న బీసీ హాస్టల్ లోకి తరలించామని చెప్పారు.
ఎస్‌టి రెసిడెన్షియల్ పాఠశాలలోని 500 మంది విద్యార్థులను, 26 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరిని అక్కడికి తరలించినట్లు ఆమె వెల్లడించారు. కొమ్మపల్లి పాఠశాల లోతట్టు ప్రాంతంలో ఉండడం, డిండి వాగు పక్కనే ఉండడం వల్ల నిరంతర వర్షం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని, భవిష్యత్తులో ఇలా కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని ఆమె వెల్లడించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం పర్శ తండా వద్ద వర్ష పరిస్థితిని పరిశీలించారు. వర్షపు నీరు ఉదృతంగా వచ్చి తాండా చెరువులో చేరడం, ఒకవేళ చెరువుకు గండి పడితే తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై ఆమె అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, దేవరకొండ ఆర్ డి ఓ రమణా రెడ్డి,తహసిల్దార్ , ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి ,డేనియల్ ఉన్నారు.