20-07-2024 12:31:05 AM
పెద్దపల్లి, జూలై19 (విజయక్రాంతి): రైతు రాజులా బతికేలా చేస్తాని, కాంగ్రెస్ పార్టీ చేసేదే చెబుతుందని, మాటలతో కోటలు కట్టే నైజం తమది కాదని మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాకు వచ్చిన వారికి మొదట కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఘన స్వాగతం పలికారు. ఓదెల మండలం కొలనూరులో నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. పెద్దపల్లి ఓదెల రోడ్డును ప్రారంభించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్‌పల్లి గ్రామంలో 24 ఎకరాల విస్తీర్ణంలో రూ.170 కోట్ల అంచనాతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 60 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. మహాలక్ష్మీ పథకాన్ని మహిళలు అదృష్టంగా స్వీకరిస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను నెరవే ర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆగస్టు లోగా మొత్తం రుణ మాఫీ చేస్తామని, రైతులకు కొత్త రుణాలు ఇస్తామని చెప్పారు.
రైతులు ప్రతికూల వాతావరణంలో కూడా దిగుబడులు సాధించేందుకు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారిం చాలన్నారు. రూ.170 కోట్లతో పెద్దరాత్‌పల్లిలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని చెప్పారు. పత్తిపాక రిజర్వాయర్ ద్వారా టేలాండ్ ప్రాంతాలకు సాగు నీరు అందిస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత మంత్రి శ్రీధర్‌బాబుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోగా, పంటలకు గిట్టుబాటు ధర కూడా చెల్లించలేదన్నారు.
తమ ప్రభుత్వం లో రైతులు కాలర్ ఎగురేసుకొని తిరిగే రోజు లు వస్తాయన్నారు. ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు రూ.లక్ష రుణమాఫీని నాలుగు విడతల్లో చేస్తే తాము ఒక్కరోజులోనే చేశామన్నారు.
పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు డిపోను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గోదావరిఖని బస్సు డిపోను మరింత విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
చొక్కారావుకు మంత్రుల నివాళి
కరీంనగర్, జూలై 19 (విజయక్రాంతి): మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ఉన్న చొక్కారావు విగ్రహానికి మం త్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.