20-07-2024 12:27:21 AM
కరీంనగర్, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణలోని రైతులందరి సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆ దిశగా ముందుకెళ్తున్నామన్నారు. శుక్రవారం కరీంనగర్ బైపాస్ రోడ్‌లోని వీ కన్వెన్షన్‌హాల్‌లో రైతు భరోసా పథకం అమలుపై ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంన గర్ ఉమ్మడి జిల్లా స్థాయి రైతుల నుంచి మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయాలను సేకరించింది.
ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నాగేశ్వర్‌రావు, రెవెన్యూ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి ప్రభాకర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు హాజరయ్యారు. మంత్రుల బృందం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ రైతు భరోసాను అందించేందుకు రైతుల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని.. వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. పంటల బీమా పథకం కూడా అమలు చేసేందుకు రూపకల్పన చేస్తున్నామని.. అతి త్వరలో ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీమా కోసం రైతులు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదని.. జిల్లాలో రైతులు ఆయిల్‌పాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వం లక్ష్యం: శ్రీధర్‌బాబు
తమ ప్రభుత్వం రైతును రాజును చేయడమే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసు కునేందుకే రైతు భరోసాపై సమావేశాలు నిర్వహిస్తున్నామని.. వారి అభిప్రాయాలను తీసుకొని విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుంటే, ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుంది: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
రైతు రుణమాఫీ పథకం చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర సాగునీటి, పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 18న ఒక్క రోజే 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7000 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. భారతదేశ చరిత్రలో ఒకేసారి ఇంత స్థాయిలో ఎక్కడ రుణ మాఫీ జరగలేదని.. సోనియా, రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట తమ ప్రభుత్వం నిల బెట్టుకుందన్నారు.
పతిపక్షాల గ్లోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రైతు భరోసాపై ప్రతిపక్షాలు చేస్తున్న గ్లోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దని రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశాయన్నారు. నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందేలా చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐటీ దాఖలు చేసే రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని, దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.
రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా రైతు భరోసా: పొన్నం ప్రభాకర్
రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్‌సింగ్ ఠాకూర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.