06-12-2024 12:20:22 AM
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5 (విజయక్రాంతి):వైద్య వ్యవస్థను బ్రష్టు పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిని ఆయను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది పనితీరు, రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు పంపుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించామని ఆయన పేర్కొన్నారు.
మొత్తం 39మందికి గానూ 12 మంది మాత్రమే విధులకు హాజరయ్యారని, అటెండెన్స్ రిజిస్టర్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల గైర్హాజరుపై విచారణకు ఆదేశిస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైందని, దీన్ని సహించమని స్పష్టం చేశారు. వైద్య పరికాలు, మందులు, సిబ్బంది కొరతపై ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాన్‌రావు, టీజీఎస్ జిల్లా నాయకులు భూక్యా శ్రీనివాస్, నేరేళ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.