calender_icon.png 11 November, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో పేలుడు

11-11-2025 01:42:55 AM

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఘటన

13 మంది మృతి

  1.  24 మందికి పైగా తీవ్రగాయాలు.. పలువురి పరిస్థితి విషమం
  2. చెల్లాచెదురుగా మృతదేహాలు, పూర్తిగా ధ్వంసమైన పది వాహనాలు
  3. అన్నికోణాల్లో దర్యాప్తు : అమిత్‌షా

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందా రు. 24 మందికిపైగా గాయాలయ్యాయి. మృతదేహాలు తునాతునకలయ్యాయి. ధ్వంసమైన కార్లు చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తీవ్ర తకు సమీపంలోని షాపులు ధ్వంసమయ్యాయి. పేలుడులో తొమ్మిది వాహనాలకు పైగా పూర్తిగా దెబ్బతిన్నాయి.

అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రుల్లో ఆయన పరామర్శించారు. సంఘటన స్థలంలో డీవీఆర్, సీసీ టీవీ ఫుటేజీలు సేకరించారు. ఢిల్లీ ఘటనతో దేశమంతా హై అలర్ట్ అయ్యింది. ఆయా రాష్ట్రాల్లో పోలీసు, భద్రతా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి.

భీతావహంగా ప్రమాద స్థలం..

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రజలతో కూడి న కారు సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో పేలిపోయింది. అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రాంతం లో ఒక్కసారిగా భయానకంగా మారింది. ఈ పేలు డులో 13 మంది మరణించారు. 24 మంది కి పైగా గాయాలవ్వగా చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి, లోక్ నాయక్ హాస్పిటల్ (ఎల్‌ఎన్‌జేపీ)లోకి తరలించి, వైద్యం అందిస్తున్నారు.

దీంతో అక్కడ ఆందోళన చెందు తున్న బంధువులు గుమిగూడారు. ఏడాది పొడవునా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ఆ ప్రాంతం పేలుడుతో భీతావహంగా మారింది. కొన్ని క్షణాల్లోనే భారీ సంఖ్యలో పోలీసులు, భద్రతా సిబ్బందితో నిండిపోయింది. ఈ ఘటనపై ప్రధాన ఉగ్రవాద దర్యాప్తు సంస్థ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), జాతీయ భద్రతా దళం దర్యాప్తు చేస్తున్నాయి.

పేలుడు ఘటనతో హైదరాబాద్ నుంచి కేంద్ర మంతి బండి సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్టు సమాచారం. ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచా రిస్తున్నట్టు తెలిసింది. కారు యజమాని హదీమ్‌ఖాన్‌గా గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కారులో ముగ్గు రు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. 

ఈ ఘటన అత్యంత హృదయ విదారకమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఈ పేలుడు తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు అత్యంత బాధాకరమని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన ని చెప్పారు. ఈ ఘటనపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

దేశమంతా హైఅలర్ట్

ముంబై, కోల్‌కతా, జైపూర్, హర్యానా, పంజాబ్, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించా యి. భద్రతను పటిష్టం చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే రేపు రెండో, చివరి దశ పోలింగ్‌లో ఓటు వేయనున్న బీహార్ కూడా అప్రమత్తమైంది. ఎన్నికల అధికారులు కూడా అలర్ట్ అయి భద్రతకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

ఘటనపై ప్రధాని మోదీకి అమిత్‌షా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పేలుడు గురించి వివరించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతులు పరిస్థితి గురించి హోంమంత్రికి క్రమం తప్పకుండా తెలియజేస్తున్నారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. పేలుడుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని ప్రధాని మోదీకి తెలిపామని ఆయన పేర్కొన్నారు.

10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి పోలీసు బృందాలు

‘పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ బృందాలు, ఎఫ్‌ఎస్‌ఎల్‌తో పాటు, ఇప్పుడు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి.  సమీపంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని ఆదేశించామని అమిత్‌షా తెలిపారు. ‘మేము అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నాం.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం’ అని షా తెలిపారు. గాయపడిన వారిని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో అమిత్‌షా పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ఘటనా స్థలాన్ని కూడా అమిత్‌షా పరిశీలించి, పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారం ప్రధాని మోదీకి ఇచ్చామని షా తెలిపారు. 

భారీ అగ్నిగోళం..

పేలుడు కారణంగా గాయపడిన ఆటో డ్రైవర్ జీషన్ మాట్లాడుతూ, ‘నా ముందు ఉన్న కారు రెండు అడుగుల దూరంలో ఉంది. అందులో బాంబు ఉందా లేదా మరేదైనా ఉందా అని నాకు తెలియదు, కానీ అది పేలింది.

‘నా ఇంటి టెర్రస్ నుంచి ఒక పెద్ద అగ్నిగోళాన్ని చూశాను. భారీ శబ్దం వచ్చింది. పేలుడు దాటికి భవనాల కిటికీలు పగిలిపోయాయి’ అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘నేను గురుద్వారాలో ఉన్నప్పుడు ఒక భారీ శబ్దం విన్నా. అది ఏమిటో మాకు అర్థం కాలేదు, అది అంత బిగ్గరగా ఉంది’ అని మరొకరు పేర్కొన్నాడు.

ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం..

‘ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదిలే వాహనంలో పేలుడు సంభవించిందని ఢిల్లీ పోలీసు కమిషనర్ సతీష్ గోల్చా తెలిపారు. ‘మేము వెంటనే స్పందించాం. ఏడు బృందాలను సంఘటనా స్థలానికి పంపాం. దాదాపు రాత్రి 7:29 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చాం’ అని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ తెలిపారు. రాజధాని నుంచి కేవలం 50 కి.మీ దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో 2,900 కిలోల పేలుడు పదార్థాల భారీ నిల్వ దొరికిన రోజే ఢిల్లీలో పేలుడు జరిగింది. దీంతో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

మృతులకు ప్రముఖుల సంతాపం

ప్రమాదం అత్యంత్య బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని వారు తెలిపారు. 

కారు యజమాని అరెస్ట్!

పేలిన ఐ20 కారు యజమాని నదీమ్‌ఖాన్, అతను హరియాణా వాసిగా, హర్యానాలోనే ఐ20కారు నంబర్ హెచ్‌ఆర్26 7674గా రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కారు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ పేలుడుకు పుల్వామా దాడికికు లింక్ ఉన్నట్లు దర్యాప్తు బృందాలు విచారిస్తున్నాయి. ఇది ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్, ఎస్‌పీజీ, ఎన్‌ఎస్‌జీ, ఏటీఎస్ బృందాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో స్పెషల్ సెల్ తనిఖీలు చేస్తోంది. 

హెల్ప్‌లైన్ నంబర్లు

* ఎల్‌ఎన్‌జేపీ: 011-23233400, 23239249

* కంట్రోల్ రూమ్ : 011-22910010, 22910011

* ఢిల్లీ పోలీస్ ఎమర్జెన్సీః 112