01-01-2026 01:12:57 AM
ఎమ్మెల్యే డా. హరీష్‌బాబు
బెజ్జూర్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు బుధవారం బెజ్జూర్, చింతలమాలపల్లి, కౌటాల, సిర్పూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల రైతు వేదికల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. బెజ్జూర్లో 66 మంది, చింతలమాలపల్లిలో 63 మంది, కౌటాలలో 38 మంది, సిర్పూర్ (టి)లో 19 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణ పను లు ప్రారంభించాలని సూచించారు. నిర్ణీత గడువులో పనులు ప్రారంభించని పక్షంలో మంజూరు పత్రాలను రద్దు చేసి అర్హులైన ఇతరులకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందని హెచ్చరించారు.గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రితో చర్చించి 500 అదనపు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించామని తెలిపారు. గిరిజన కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
గతంలో వడ్ల కటింగ్ సమస్యలు ఉండేవని ఎమ్మెల్యేగా చేపట్టిన తర్వాత వడ్ల కటింగులు జరగకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపా రు. సోమిని, మూగవెల్లి గ్రామాలకు రహదారులు, వంతెనల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు పొందేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో కోట ప్రసాద్, ఎంపీఓ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, ప్రమోద్, వినోద్, సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.