17-12-2025 12:00:00 AM
21న జాతీయ లోక్ అదాలత్
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను సత్వరం పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సరైనదని అందులో పరిష్కరించిన వారికి సమయం, మానసిక ప్రశాంతతతో పాటు కొన్ని కేసులకు కోర్టు ఫీజులు కూడా తిరిగి చెల్లించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ తెలి పారు. మంగళవారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 21న ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆయా కోర్టు వేదికగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
క్షణికావేశంలో తెలిసి తెలియక జరిగిన తప్పులను సరిదిద్దు కునే అవకాశం కల్పిస్తుందన్నారు. చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాద పరిహార దావాలు, బ్యాంకు రుణాలు, విద్యుత్ బిల్లులు, ఇతర సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కంపౌండబుల్ కేసులను విచారించి పరస్పర రాజీ ద్వారా వెంటనే పరిష్కరించనున్నట్లు తెలిపారు.
రాజీ ద్వారా ముగిసే సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి చెల్లింపు చేయబడే సౌకర్యం కూడా ఉందని, పెండింగ్ కేసులు ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నసీమ్ సుల్తానా అన్నారు. వారితో పాటు ఇతర న్యాయమూర్తులు ఉన్నారు.