calender_icon.png 19 October, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉంటాం

17-10-2025 12:28:35 AM

-డబుల్ ఇంజిన్ సర్కార్‌తో శరవేగంగా అభివృద్ధి

-వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక భాగస్వామి

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

-రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం  

-కర్నూలు జిల్లా నన్నూరులో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ

-శ్రీశైలం మలన్నను దర్శించుకున్న మోదీ

కర్నూలు(ఆంధ్రప్రదేశ్), అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూపంలో రాష్ట్రానికి శక్తిమంతమైన నాయకత్వం లభించిందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో గత 16 నెలలుగా ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తోందని ప్రశంసించారు. గురువారం కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన, చేపట్టనున్న రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ అభివృద్ధి చాలా ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందని ప్రధాని అన్నారు. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ‘విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్, సబ్-సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ సబ్-సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్‌వేగా మారనుంది’ అని మోదీ తెలిపారు.

దేశ ఇంధన భద్రతలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ‘జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ ఒక ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన పథకాలు, సంస్కరణలు తీసుకురానున్నామని ప్రకటించారు. ప్రధాని మోదీ దార్శనికత వల్లే 2047 నాటికి ప్రపంచంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చంద్రబాబు కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని కొనియాడారు. దేశ సేవే లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారని  ప్రశంసించారు. మంత్రి నారా లోకోశ్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రధాని మోదీ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. 

శ్రీశైలం మలన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధాని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ దర్శనం తర్వాత ప్రధాని మోదీ శ్రీశైలంలో ఉన్న శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించిన దానికి గుర్తుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ధ్యాన మందిరాన్ని, శివాజీ విగ్రహాన్ని ప్రధాని పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులు దాని ప్రాముఖ్యతను మోదీకి వివరించారు.