14-08-2025 01:30:52 AM
పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి
నారాయణపేట.ఆగస్టు 13(విజయక్రాంతి):భూ నిర్వాసితులకు అండగా ఉం టామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి తెలిపారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన ఊట్కూరు మండలం బాపూర్, దామరగిద్ద మండలం బాపన్ పల్లి,నారాయణపేట మండలం పేర పళ్ళ, కౌరంపల్లి శివారులోని దాదాపు 71 మంది రైతులకు చెందిన 51.36 ఎకరాల భూమికి సంబంధించిన 7 కోట్ల 7 లక్షల నష్టపరిహారం చెక్కులను బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో రామచందర్ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆమె తెలిపారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద భూములు పోయినా ఇంత వరకు ఇంకా రైతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని, మన జిల్లా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నందుకే భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం డబ్బులను అందజేయడం జరుగుతుందన్నారు.
భూనిర్వాసితులు నిరాశ చెంద వద్దని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో భూనిర్వాసితులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను ఇవ్వడం అభినందనీయం అన్నారు. రైతుల మేలు మరచిపోలేమని తెలిపారు. ఇన్నేళ్లు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకంతో పచ్చ బడుతుందని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, దామరగిద్ద విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, నారాయణపేట, దామరగిద్ద,ఊట్కూరుతహాసిల్దార్లు అమరేంద్ర కృష్ణ, తిరుపతయ్య, చింత రవి, ఆర్డిఓ ఆఫీస్ డీ.టీ. బాల్ రాజ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సలీం, యువజన కాంగ్రెస్ నాయకులు మధు, కోట్ల రవి, రెవెన్యూ సిబ్బందిపాల్గొన్నారు.