12-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు చేపట్టిన ఆక్రమణలను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. లేఅవుట్ లోని రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై దాఖలైన కేసులో మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టగా శ్రీధర్‌రావుకు చుక్కెదురైంది.
లేఅవుట్‌లోని రోడ్లు, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు మరో సారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలోని ఈ లేఅవుట్‌లో 162 ప్లాట్లు ఉండగా, వాటిలో మెజారిటీ ప్లాట్లు తనవేనన్న ఉద్దేశంతో రోడ్లు, పార్కులను శ్రీధర్‌రావు ఆక్రమించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘ఒకసారి లేఅవుట్ వేస్తే, దానిని మార్చడానికి వీల్లేదు. మెజారిటీ ప్లాట్లు మీవే అయినంత మాత్రాన, ప్రజా వినియోగ స్థలాలను ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు” అని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇటీవల హైడ్రా చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలను ఈ సందర్భంగా న్యాయస్థానం సమర్థించింది. హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించగా విచారణ సందర్భంగా శ్రీధర్‌రావు వల్ల ఇబ్బందులు పడుతున్న పలువురు ప్లాట్ల యజమానులు తమ గోడును కోర్టుకు విన్నవించుకున్నారు. ఎక్కువ ప్లాట్లు కొనుగోలు చేశాననే అహంతో, మిగిలిన వారిని భయపెట్టి వారి ప్లాట్లను కూడా కాజేయాలని శ్రీధర్‌రావు ప్రయత్నించారని, లేఅవుట్ సరిహద్దులను చెరిపేసి, తమ ప్లాట్లలోకి కూడా చొచ్చుకొచ్చి నిర్మాణాలు చేపట్టారని, ఇదేమని అడిగితే దాడులు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో ఓ ప్లాట్ యజమానురాలిపై దాడి చేసినందుకుగాను సుప్రీంకోర్టు శ్రీధర్‌రావుకు రూ.10 లక్షల జరిమానా విధించిన విషయాన్ని కూడా వారు గుర్తుచేశారు. తమ ప్లాట్లను చూసుకోవడానికి కూడా వీల్లేకుండా చేసి, భయభ్రాంతులకు గురిచేయడంతోనే హై డ్రాను ఆశ్రయించినట్టు చెప్పారు. బాధితుల వాదనలు విన్న జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లేఅవుట్‌లోని రోడ్ల పునరుద్ధరించాలని మరోసారి హైడ్రాకు సూచించారు. తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.