18-01-2026 12:00:00 AM
ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి
ఖైరతాబాద్,జనవరి 17(విజయక్రాంతి): సాధుసంతుల మార్గదర్శనంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగడాకుల బాలస్వామి అన్నారు. ఈ విషయమై ఆయన శనివారం మాట్లాడుతూ ఇటీవల జరిగిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో స్వామిజీలను సమన్వయం చేసే బాధ్యతలను తనకు అప్పగించారన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. మఠాలు, పీఠాలు,స్వామీజీల ఆశ్రయాలు, దేవాలయాల కేంద్రంగా హిందుత్వ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
కులాల మధ్య అంతరాలను చెరిపి హిందువులంతా ఒకటేనన భావనను పెంపొందిస్తామన్నా రు. అందుకోసం సాధుసంతుల ఆశీర్వాదంతో పనిచేస్తా మని ప్రకటించారు. తెలిసీ తెలియక మతం మారిన వారిని స్వధర్మంలోకి తీసుకొస్తామన్నారు. ధార్మిక సదస్సుల నిర్వహణ ద్వారా హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తామని వెల్లడించారు. అదే విధం గా సాధుసంతులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోరాడుతామని తెలియజేశారు. ధర్మం బలపడితేనే దేశం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ధర్మ కార్యంలో హిందూ ధర్మంలో భాగమైన బౌద్ద, జైన, సిక్కు ఆచారాల వారిని కూడా కలుపుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలిపారు.