16-08-2025 08:39:27 PM
త్వరలోనే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
చేవెళ్ల: ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు రైతు భరోసా, పేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ ఒక వైపు, రోడ్లు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఇంకోవైపు జరుగుతోందని చెప్పారు. శనివారం చేవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి మల్కాపుర్ వరకు రూ. 3.35 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డుకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో మెయిన్ రోడ్డు నుంచి గ్రామానికి రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. తర్వాత తంగడపల్లి గ్రామంలో అభయాంజనేయస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
అంతకుముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు. రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్న ఆమె.. ఇప్పటికే చాలా మంజూరు చేశామని, ఇందులో కొన్ని మోడల్ రోడ్స్ కాగా, కొన్నింటికి డైరెక్ట్ గా నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. చాలా వరకు టెండర్లు పూర్తయినా వర్షాకాలం కావడంతో పనుల్లో కొంచెం జాప్యం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే సూచన మేరకు మరిన్ని రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే యాదయ్య సొంత గూటికి వచ్చారని, గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడి.. త్వరలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ వసంతం, మెంబర్ షాబాద్ దర్శన్, మహిళా కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోనె సరిత రెడ్డి నేతలు మర్పల్లి కృష్ణారెడ్డి, గోనె శ్రీనివాస్ రెడ్డి, పడాల ప్రభాకర్, పడాల రాములు, సాయినాథ, పడాల జనార్ధన్, రాంచంద్రయ్య, దర్శన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.