calender_icon.png 29 August, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి:పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

29-08-2025 09:44:48 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రజల సంక్షేమానికి ప్రజా పాలన ద్వారా కృషి చేస్తున్నామని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో వరద నీటి పరిస్థితి, మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు లోనికి 7 లక్షల నుండి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరిందని తెలిపారు.

నది తీర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వరదల కారణంగా ప్రతి సంవత్సరం మాత శిశు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిసారి వారి సంక్షేమం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించడం బాధాకరమని అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మాణం అవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి అయిన తర్వాత మాతా శిశు ఆసుపత్రిని తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మాతా శిశు ఆసుపత్రి నుండి తరలిస్తున్న గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు స్పందిస్తూ అవసరమైన ప్రజా రక్షణ చర్యలు చేపడుతున్నారని ఏంటి అన్నారు. ఇందులో భాగంగా ఎయిర్ సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... జిల్లాలో కురుస్తున్న వర్షాలు నేపథ్యలో వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజల రక్షణ కొరకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ నుండి 5.50 లక్షల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుండి 50 వేల క్యూసెక్కుల వరద నీటితో పాటు జిల్లాలోని వాగులు, చెరువుల నుండి అదనంగా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని కలుపుకొని 8 లక్షల క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోనికి ఇన్ ఫ్లో అవుతుందని తెలిపారు. వరద నీటి కారణంగా మొదట ప్రభావితమయ్యే మాత శిశు ఆసుపత్రి నుండి గర్భిణీలు, బాలింతలు, పిల్లలను ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు 179 మందిని తరలించడం జరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో 30 కోట్ల రూపాయల వరకు పనులు పూర్తయ్యాయని, పనులను మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావస్తుందని, డిసెంబర్ 31వ తేదీన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ

జిల్లా కేంద్రంలో నిర్మాణం అవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎంపీ వంశీకృష్ణ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పిడుగుపాటుకు గురై వైద్య సేవలు పొందుతున్న కోటపల్లి మండలానికి చెందిన రాజమల్లును పరామర్శించి బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. అనంతరం నస్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గడ్డం వెంకటస్వామి (కాకా) ట్రస్ట్ తరపున ఆసుపత్రికి కుర్చీలను అందజేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలన్నారు.