29-08-2025 09:14:02 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసల జల్లు
నల్గొండ జిల్లాలో అందిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఎమ్మెల్యేగా గెలుపొందిన క్షణం నుంచి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ వివిధ నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తూ అడుగులు వేస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి.. ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం లో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం లో పదవతరగతి విద్యార్థులకు అందిస్తున్న డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ వాటి వినియోగించడం వలన కలిగే ఫలితాలు, వినియోగించే విధానాలు తదితర అంశాలపై మంత్రిగారికి సుదీర్ఘంగా వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గత రెండు సంవత్సరాలలో వచ్చిన పదవ తరగతి ఫలితాల పెరుగుదల మార్పులు గురించి మంత్రిగారికి ఎమ్మెల్యే గారు వివరించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కేవలం 60 నుంచి 65 శాతం పాస్ పర్సెంటేజ్ ఉండేదని, డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను విద్యార్థులు వినియోగించడం చేత మొదటి సంవత్సరం 21% మేరకు ఫలితాలు అధికంగా వచ్చాయి.
రెండో సంవత్సరం మరింత పెరిగి 92% వరకు పాస్ పర్సెంటేజ్ చేరిందని, ఈ సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి శతశాతం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రిగారికి తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోర్డు లలో స్టడీ కంటెంట్ ను లోడ్ చేసి ఉపాధ్యాయులకు డిజిటల్ బోర్డుల వినియోగంపైన నిపుణుల చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతినిత్యం ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులు డిజిటల్ బోర్డులను ఉపయోగించే విధంగా కార్యక్రమాలు చేస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నామని మంత్రికి ఎమ్మెల్యే వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ తో పాటు డిజిటల్ బోర్డు లో వినియోగించే డిజిటల్ స్టడీ మెటీరియల్స్ తన జిల్లా లోని విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న పదవ తరగతి వార్షిక ఫలితాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఐలా త్రిపాథి గ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలు పెంచేందుకు ప్రభుత్వ నిధులు కేటాయించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడానికి తాను కృషి చేస్తానని ఆమె తెలిపారు.