25-10-2025 07:28:16 PM
* ఏఎంసీకి శాశ్వత కార్యదర్శిని నియమించాలె
* మార్కెట్ యార్డు సామర్థ్యాన్ని పెంచాలె
* బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు
హుస్నాబాద్: అకాల వర్షాలతో తడిసిపోయిన రైతుల వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి హుస్నాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని వడ్ల కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించారు. అక్కడ పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే మార్కెట్ అధికారులు 'కొర్రీలు' పెట్టి కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల వడ్లు తడిసి ముద్దయిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10-15 రోజులుగా రైతులు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారని, తాలు, తేమ శాతం పేరుతో అధికారులు రైతులను అరిగోస పెడుతున్నారన్నారు.
సన్న వడ్లు పండించినా కష్టాలే
సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని శంకర్ బాబు ఉదహరించారు. సన్న వడ్లు పండించిన రైతు సారవ్వ 15 రోజుల క్రితం వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, తేమ శాతం 17 ఉన్నప్పటికీ, '650 బస్తాలు అయితేనే లోడ్ అవుతుంది' అని అధికారులు చెప్పడంతో అప్పటి నుంచి ఆమె పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. ఈలోగా అకాల వర్షాల వల్ల ఆమె వడ్లు మళ్లీ తడిసిపోయాయని, రైతులు ఈ విధంగా ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మార్కెట్ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ సూపర్‌వైజర్ గంగారాంకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు.
మార్కెట్ యార్డుకు కార్యదర్శి లేకపోవడంతో రైతుల సమస్యలు పట్టించుకునే దిక్కులేదని, వెంటనే కార్యదర్శిని నియమించాలని కోరారు. పెరిగిన రైతులకు అనుగుణంగా మార్కెట్ సామర్థ్యాన్ని పెంచాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా త్వరితగతిన వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు వేముల దేవేందర్ రెడ్డి, తోట సమ్మయ్య, వరయోగుల అనంతస్వామి, వేల్పుల నాగార్జున్, వెంకటేశ్, రాజేందర్ చారీ, నరేశ్, రాజేశ్, రమణ తదితరులున్నారు.