03-01-2026 12:00:00 AM
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న తాజాచిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఈ సినిమాలోని ‘వామ్మో వాయ్యో’ సాంగ్ ను శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, దర్శకుడు కిషోర్ తిరుమల, చిత్రబృందం పాల్గొన్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరపర్చిన ‘వామ్మో వాయ్యో..’ గీతానికి దేవ్ పవార్ సాహిత్యం అందించగా, స్వాతిరెడ్డి ఆలపించారు.
‘ఇల్లు పాయె ఒల్లు పాయె.. ఓ రామ రామ.. గా లచ్చుగాని ఎచ్చులు పాయె.. ఓ రామ రామ.. సెల్లు పాయె సిమ్ము పాయె.. ఓ రామ రామ.. గా సూరిగాని సొల్లు పాయె.. ఓ రామ రామ.. పువ్వు పాయె నవ్వు పాయె.. రామ రామ.. గీ పొట్టిదాని లవ్వు పాయె.. రామ రామ.. ముద్దు ముచ్చటంత పాయె.. మూతిపండ్లు రాలి పాయె.. వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..’ అంటూ సాగుతోందీ పాట. జానపద బాణీల్లో వినిపించే ‘ఒల్లెంకలో..’ ‘సల్లెంకలో..’ వంటి అనుకరణ పదాలు పాటకు ప్రత్యేక అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ చిత్రానికి డీవోపీ: ప్రసాద్ మురెళ్ల; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ఆర్ట్స్: ఏఎస్ ప్రకాశ్.