03-01-2026 12:00:00 AM
‘మేమ్ ఫేమస్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాతో సుభాష్‌చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతుండగా నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఇందులో జగపతిబాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కథానాయకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ..
“ఒక కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్టుగా ఉంటుందీ సినిమా. ప్రేక్షకులు టికెట్ కొని థియేటర్‌లో కూర్చుంటే గోల్డెన్ అవర్‌లో గోదావరి పడవ ఎక్కినట్టు అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు. హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మాయ క్యారెక్టర్‌లో నటించడం ఒక పెద్ద సవాల్‌గా అనిపించింది. మాయాలోని ప్రతి భావోద్వేగాన్నీ సరికొత్తగా బయటకి తీసుకొచ్చారు మా డైరెక్టర్.
నన్ను నేను ఒక ఉత్తమ నటిగా మల్చుకోవడానికి మా డైరెక్టర్ చాలా మద్దతుగా నిల్చున్నారు. మాయ క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపించిన పాత్ర. చాలామంది అమ్మాయిలు మాయ క్యారెక్టర్‌ను రిలేట్ చేసుకుంటారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అని తెలిపింది. ‘ఇది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ’ అని డైరెక్టర్ సుభాష్‌చంద్ర అన్నారు. రాజ్‌కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. “రాజావారు రాణి వారు’ తర్వాత అచ్చమైన గోదావరి సినిమా చేయమని చాలా మంది అడిగారు. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్‌స్టోరీ. అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది” అన్నారు.