కూల్చివేత గోప్యతలో మర్మమేమిటో..!
- వివరాలను వెల్లడించడానికి ఇరిగేషన్ అధికారులు వెనుకడుగు
- భారీ ఎత్తున డబ్బులు చేతులు మారిన్నట్లు పెద్ద అంబర్‌పేట్‌లో చర్చ
అబ్దుల్లాపూర్‌మెట్, మే 5: ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసి.. ఆ కూల్చివేతల సమాచారాలను ఎక్కడ వెల్లడించకుండా ఇరిగేషన్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్‌పేట్ 52 డివిజన్ పరిధి పెద్ద అంబర్‌పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాలలో ఓ ప్రైవేట్ వెంచర్‌ను నిర్మిస్తున్నారు. ఆ వెంచర్ వెలువ కాల్వ ఉంటుంది.
ఆ కాల్వ ఈదుల చెరువు తూం నుంచి గుడ్ విల్ హోమ్స్, భువనేశ్వరి నగర్ మధ్యల నుంచి హరితహరం కాలనీకి అనుకున్న పాత జెడ్‌పీ రోడ్డు గుండ తారా హోమ్స్ పక్క నుంచి నకామర్రి కాల్వ ఉంటుంది. సర్వే నెంబర్ 112 కాల్వ నుంచి సౌటకుంటలోకి నీరు చేరుతుంది. ఆ ప్రైవేట్ వెంచర్ లోపల నుంచి సర్వే నెంబర్ 112 కాల్వకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటుంది. అందులో నిర్మించిన నిర్మాణాలను ఇరిగేషన్ అధికారులు పరిశీలించిన ఆ నిర్మాణాలను కూల్చివేశారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో కూల్చాసిన నిర్మాణాలు ఇంకా ఉన్నట్లు తెలిసింది. కూల్చి వేతలు తూ.. తూ మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. ఈ కూల్చివేతల సమాచారాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఇరిగేషన్ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయంలో భారీ ఎత్తున డబ్బులు దండుకున్నట్లు పెద్ద అంబర్‌పేట్ పెద్ద చర్చ జరుగుతుంది. కూల్చివేత వివరాల కోసం ఇరిగేషన్ అధికారులను ఫోన్ సంప్రదించగా స్పందించకపోవడం పలు అనుమానాలు తవ్విస్తుంది.






