01-08-2025 12:09:04 AM
డాక్టర్ విజయభాస్కర్ :
రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణవ్యాప్తం గా ఉన్న సర్కార్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్‌కు నోచుకోవడం లేదు. వర్తింపు కోసం టీచర్లు ఏళ్ల నుంచి ఎదరుచూస్తున్నారు. 2005లో తమకు కామన్ సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని కొంతమంది ఉపాధ్యాయులు నాటి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
ఆ ట్రిబ్యునల్ వాద, ప్రతివాదనలు విన్న తర్వాత ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కామ న్ సర్వీస్ రూల్స్ అమలు చేయడం కుదరదని, ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాల ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీస్ రూల్స్ ఉన్నాయని తేల్చిచెప్పింది. ఆ తీర్పు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చింది. పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నాడు ఎంతో నిరాశకు గురయ్యారు.
తాము ఎలాగైనా కామన్ సర్వీస్ రూల్స్ సాధిస్తామని, కొందరు ఒక కొత్త ఉపాధ్యా య సంఘాన్ని ఏర్పాటు చేశారు. డబ్బులు సమకూర్చుకుని ఆతీర్పును సవాల్ చేస్తూ, హైకోర్టుకు అప్పీల్ చేశారు. హైకోర్ట్‌లోనూ మళ్లీ ప్రభుత్వ ఉపాధ్యాయులకే అనుకూలంగా తీర్పు వచ్చింది. పంచాయితీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉండడంతో వారికి లేనిపో ని ఆశలు కల్పించి, మళ్లీ నేతలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తామని ముందుకు వచ్చారు.
అనుకున్నట్లే సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు లోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులకే అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్ట్ ద్వారా న్యాయం జరగదని, తీర్పు ఏకపక్షంగా ఉంటుందని భావించిన పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు తర్వాత రాజకీయ నేతల వైపు మళ్లారు. కామన్ సర్వీస్ రూల్స్ అమ లు చేయాలని ఆయా ప్రభుత్వాల హయాంలో ముఖ్యమంత్రులు సహా మం త్రులను కలిశారు.
పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని, కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేస్తే ఉపాధ్యాయులంద రూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటామని వారిని మెప్పించారు. తద్వారా రాష్ర్ట పతి ద్వారా సర్వీస్ రూల్స్ ఉత్తర్వులను సాధించారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నా యని, నాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు పిటిషన్‌పై స్పందిస్తూ, ఇకపై సుప్రీంకోర్టును ఆశ్రయించొద్దని, హైకోర్టు లో సర్వీస్ రూల్స్ విషయం తేల్చుకోవాలని పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తిరిగి హైకోర్టు కు అప్పీల్ చేశారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో సర్వీస్ రూల్స్ వ్యవహా రం కోర్టులో నానుతూనే ఉన్నది.
విద్యాశాఖలో ఖాళీలు..
రెండు దశాబ్దాల నుంచి రాష్ట్రస్థాయిలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో పాటు జిల్లాస్థాయి లో జిల్లా విద్యాశాఖ అధికారులు, డైట్, బీఎడ్, ఐఎఎస్‌ఈ, రాష్ర్ట విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ)లోని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 66.6 శాతం సర్వీస్‌లో ఉపాధ్యాయులకు పదోన్నతులు 33.3 శాతం నేరుగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వీస్ రూల్స్ సమస్యకు పరి ష్కారం దొరకలేదు. సమస్య పరిష్కారం కోసం పోరాడే వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే, ‘మూడు అడుగుల ముం దుకు.. ఆరు అడుగుల వెనుకకు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారులు, డైట్, బీఎడ్, ఐసీఎస్‌ఈ, విద్యా పరిశోధన శిక్షణ సంస్థ పదోన్నతులకు అవకాశం ఉంది.
పంచాయితీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కేవలం మాత్రం స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయుల వరకు మాత్రమే అవకాశం ఉంది. తెలంగాణ విద్యాశాఖలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేస్తే, ఆ ప్రభావం అనేక డిపార్ట్‌మెంట్లపై పడే అవకాశం ఉంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్త సర్వీస్ రూల్స్ అమలు అవు తాయని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎం తోకాలం ఎదురుచూశారు. రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు కావొస్తున్నా సర్వీస్ రూల్స్ వ్యవహారం ముందుకు సాగడం లేదు.
ఉన్న కేడర్‌లోనే రిటైర్‌మెంట్..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయు ల సర్వీస్ రూల్స్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున త్వరలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 33.3 శాతం ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.
సీనియర్ ఉపాధ్యాయులు 66.6 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 33.3 శాతం భర్తీ చేస్తే సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఉపా ధ్యాయులు రెండు దశాబ్దాలుగా డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు, సెట్, నెట్ పూర్తి చేసి డైట్, బీఎడ్, ఎస్సీఈఆర్టీ, ఐసీఎస్‌ఈ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారులుగా పదోన్నతులు వస్తాయని ఆశతో ఎదురు చూసి చూసి, ఎలాంటి పదోన్నతులు రాకుండా ఉద్యోగంలో ఏ క్యాడర్‌కైతే ఎంపిక అయ్యారో, అదే క్యాడర్‌లోనే పదవీ విరమణ చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రస్తుతం ముగ్గురు మాత్రమే పూర్తి స్థాయి జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నారు. మిగిలిన 30 జిల్లాల్లో ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారులే పనిచేస్తున్నారు. అలాగే విద్యాశాఖ లో కారుణ్య నియామకాల ద్వారా ఆఫీసు సబ్ ఆర్డినెట్ (అటెం డర్), జూనియర్ అసిస్టెంట్లుగా చేరిన వారు సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అడిషనల్ డెరైక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులుగా పదోన్నతులు పొందుతుం టే, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాల ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రం వాటికి నోచుకోకుండానే పదవీ విరమణ చేసే పరిస్థితులు రావడం శోచనీయం.
రాష్ట్రప్రభుత్వం చొరవ చూపాలి..
విద్యాశాఖ పరిధిలోని పలు శిక్షణ సం స్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యుల పోస్టులు భర్తీ చేయకుండా, టీచర్ల సర్వీస్ రూల్స్ సమస్యకు పరిష్కారం చూపకుండా.. విద్యాశాఖ ఏమాత్రం పరిపుష్టంఅయినట్లు కాదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తలుచుకుంటే ఇప్పటికైనా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుం ది. విద్యావ్యవస్థ పరిపుష్టం కావాలంటే ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపాలి.
రెండు దశాబ్దా లుగా పదోన్నతులకు నోచుకోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాల ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ సంఘాల కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల బలోపేతం కోసం ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా రు. ఇప్పటికే ప్రభుత్వం సర్కార్ విద్యాసంస్థలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నది.
ఉచి తంగా ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి సెలవులు ముగిసే లోపే విద్యార్థులకు ఉచితం గా పాఠ్య, నోట్ పుస్తకాలు అందిస్తున్నది. యూనిఫాం సమకూరుస్తున్నది. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేసింది. సర్కార్ బడులను కార్పోరేట్ పాఠశాలల మాదిరిగా మారుస్తున్నది.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి కూడా సిద్ధమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యా ర్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇక ఉపా ధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కూడా కల్పిస్తే బాగుంటుంది. పదోన్నతుల ద్వారా విద్యాశాఖకు మరింత బలం వస్తుంది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు బాటలు పడతాయి.
- వ్యాసకర్త సెల్: 92908 26988