31-08-2025 08:51:14 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి వద్ద బాధితుల ఇబ్బందులు బిజెపి నాయకులకు కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. ఆదివారం కామారెడ్డి వరద బాధితులను ఎమ్మెల్సీ బృందంతో కలిసి పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందే విధంగా కృషి చేస్తామన్నారు. వరదలతో కామారెడ్డి జిల్లా ప్రజల అల్లాడుతుంటే బిజెపి ఏం చేస్తుందని విమర్శించారు. కేంద్రం ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారు.
ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. బిజెపి ప్రతినిధులను ప్రజలు గెలిపించింది జాలీగా కూర్చోడానికి కాదని అన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి వరద బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు తలా చేయి వేసి బాధితులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కామారెడ్డి వరద బాధితులను ఆదుకుంటామని అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధితుల పరిస్థితులు వింటే కన్నీళ్లు వస్తున్నా యని అన్నారు. ప్రజల బాధలు వింటే చలించి పోవాల్సి వస్తుందన్నారు. కామారెడ్డి జిల్లాలో వరద బాధితులకు జరిగిన నష్టం వివరాలు సేకరించి ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీల బృందం ప్రతినిధులు తెలిపారు.