calender_icon.png 15 September, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వూరు దాటేటప్పుడు

23-06-2025 12:00:00 AM

పక్షిలా రెక్కలాడించుకుంటూ 

పొట్ట చేతబట్టుకుని

వలసకు బయలుదేరినప్పుడు

నువ్వు అన్నింటినీ 

వదిలేసి వస్తున్నప్పుడు

ఇంటి పెద్దర్వాజాకున్న గడప

నీ కాళ్ళకు అడ్డం పడి

పోవద్దని వేడుకునే వుంటది

ఇంటిముందరి ఆలికిన వాకిలి

వేసిన ముగ్గూ తడితడిగా

నీ పాదాల్ని తడుముతూ 

నిలువరించే వుంటది

ఇంటిముందరి వేపచెట్టు 

కన్నీటి ఆకుల్ని చుక్కల్లా

రాలుస్తూ కొమ్మల్ని ఆడిస్తూ

చేతులెత్తి మొక్కుతున్నట్టుగా 

నిన్ను నిలు నిలుమనే వుంటది

వూర్లో చిన్నప్పటి నుండీ

కలెతిరిగిన దారులన్నీ

తిరిగి ఎప్పుడొస్తావని

ప్రశ్నించే వుంటాయి

వూరు దాటుతున్నప్పుడు

గలగల పారే మానేరు నది

బిరాబిరా నీ కాళ్ళను చుట్టేసుకుని

పానీ పానీ అయ్యే వుంటది

వూరినైనా మనిషినైనా

దాటేసి వచ్చినప్పుడు

దుఃఖం ఇద్దరినీ కమ్మేసే వుంటది!