calender_icon.png 15 September, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగరికుడు

23-06-2025 12:00:00 AM

“...పేగు సింపుకొని పుట్టిన పిల్లని పెంచీ పెద్ద జేసీ మనసేతల్ల ఎడతన్నరు. అది పెల్లయిన మర్నాటి కానించి వల్లకాటి కెల్లీవరుకు మా కుటుమాం కోసం కష్టపడతాది. ఆ కన్నోరి రునం మనం ఏటిచ్చి తీర్సగలం...?” అన్నవాడు మన కుహనా ప్రమాణాల ప్రకారం అనాగరికుడు. మనం మనంగా కట్టుకున్న అడ్డు తెరల్ని తొలగించుకోగలిగే సమాజం నిండా సంసారం వెన్నెల పండిపోదూ?

వైశాఖ మాసం. ఎండలు మండి పోతున్నాయి.సాయంకాలం అయిదు గంటలైనా ఎండ తీవ్రంగానే ఉంది. ముఖం కడుక్కుని పెరట్లో వేపచెట్టు కింద వాలుకుర్చీలో కూర్చున్న సంజీవరావు చేతికి కాఫీ గ్లాను అందిస్తూ “పాలకొండ సంబంధం విషయం ఏమాలో చించారు?” అని అడిగింది సుభద్రమ్మ.

క్షణం సేపు ఆవిడ ముఖంలోకి చూసి “ఆలోచించే దేముంది? ఉత్తరం రాయటం మానేస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు” అన్నాడు సంజీవరావు.

“అబ్బాయి చిన్న బుచ్చుకుంటున్నాడు. ఆ అమ్మాయిని చూసి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఇదై పోతున్నాడు. వాడి మనసు నొప్పించటం...”

“రైటేనే వెర్రిదానా! పదిహేను వేలకు మించి ఇవ్వలే మంటున్నారు వాళ్ళు. మన బరువులు, బాధ్యతలు ఎవరు మోస్తారనుకొంటున్నావు? నేనా రిటైరై పెన్షను వుచ్చుకొంటున్నాను. మొన్ననే కదా, వాడి ఉద్యోగం కోసం పాతిక వేలు ముట్ట జెప్పాల్సి వచ్చింది? పెళ్ళి కావలసిన పిల్ల. రేపో, మాపో దానికీ నాలుగక్షింతలు వేయాలంటే యాభై వేలయినా ఇవ్వకుంటే సరైన సంబంధం దొరుకు తుందంటావా?” ఉపన్యాసం మొదలెట్టాడు సంజీవరావు.

భారంగా నిట్టూర్చింది సుభద్రమ్మ.

ఆవిడ మనసులోని బాధ గ్రహించి అనునయంగా అన్నాడు సంజీవరావు

“కట్నం లేకుండా మన మ్మాయిని చేసుకోవటానికి ఏ బుద్ధిమంతుడైనా ముందుకొస్తే నేనూ త్యాగం చేయగలను. మంచీ, మానవత్వం నాకు మాత్రం అక్కరలేదూ?..

“ఇకపోతే అబ్బాయి సంగతంటావా, ఈ కాలపు కుర్రిళ్ళ తీరే అంత. కాస్త నదరుగా ఏ అమ్మాయి కనపడ్డా మనను పడి పోతుంటారు. ఆ వయసలాంటిది..”

“ఉదయం అప్పల్నాయుడు మాస్టారు బజార్‌లో కనపడి ఉద్దానం సంబంధం విషయం చెప్పాడు. పదెకరాల కొబ్బరితోట, ఒక్కతే ఆడపిల్ల, అంతగా చదువుకోక పోయినా అమ్మాయి బాగానే ఉంటుందంట. ఆలోచించి చెప్తానన్నా ను” చుట్ట వెలిగించి, సుభద్రమ్మ ముఖంలోకి చూశాడు సంజీవరావు. 

ఏ భావమూ వ్యక్తం కానీయకుండా కాళీ గ్లాసందుకుని నిశ్శబ్దంగా లోనికి వెళ్ళి పోయిందావిడ. ఆలోచిస్తూ అలాగే కూర్చుండి పోయా డు సంజీవరావు.

“దండాలు బావ్‌” సవర అప్పన్న.

“ఏమిరోయ్ అప్పిగా! ఏమిటిలాగ దిగబడ్డాపు? అదీ సంజె పొద్దు వేళ” ఆశ్చర్యంగా అడిగాడు సంజీవరావు. అందులోనే వలకరింపు.

“శాన్నాళ్ళయింది, తమర్ని అమ్మగార్ని ఓ పాలి నూసెల్లి పొదామని...” వేపచెట్టు మొదల్ని అనుకుని కూర్చుంటూ అన్నాడు అప్పన్న.

తైల సంస్కారం లేక అట్టలు కట్టిన జుత్తుని వెనక్కి ముడి వేశాడు. మొలచుట్టూ ఓ చిరుగుల గావంచా. ఇది అప్పన్న అవతారం.

“చాల్లేరా లౌక్యం. మళ్ళీ పైసా పరకా ఏమ న్నా కావాల్నా ఏమిటి? ఊరకనే రావు కదా!”

“మా బాగా పోలిసినావు బావ్. సల్లకొచ్చి ముంత దాయడమేల గని, అది గందికే ఒచ్చినాను బావ్.”

“ఊఁ.. చెప్పు.”

“పిల్లడికి మనువు తిరమయింది. అయిదొంద ల్రూపాయలు ఇప్పించినా వంతె, మళ్ళీ ఎగల్లకి సింతపండు, కందులు ఇచ్చుకుంతాను.”

సంజీవరావు సవర గూడెల్లో టీచరుగా చేస్తున్న రోజుల్నించి అప్పన్నతో అనుబంధం బలీయంగా పెనవేసుకు పోయిం ది. అడపాదడపా అవసరమైనప్పుడల్లా అప్పన్న సంజీవరావు దగ్గర వందా, యాభై చేబదుళ్ళు తీసుకెళ్ళేవాడు. తిరిగి వస్తు రూపేణా కట్టెలు, చింతపండు, పనుపుకొమ్ములు, కందులు బదులుగా ముట్ట చెబుతుండేవాడు. ఆ ఆనవాయితీ సంజీవరావు రిటైరై పోయినా కూడా నేటికీ అలా సాగుతూనే ఉంది.

“అది సరే... అయిదు వందలతో ఏం పెళ్ళి అవుతుందిరా. అసలే ధరలు మండిపోతున్న రోజులు!”

“మాకు పెళ్ళి కరుసు కేటుంతాయి బావ్! పుట్టిడు కల్లు, పొట్టేలు పోతు ఉంటే సెల్లు. బంగార మెట్టాలా? బంతి బోజీ లెట్టాలా? కొం డోల్ల కులాశారం పెకారం మూడొందల పదార్లు ఈర పోలుకి ముట్ట జెప్పీసి, కోడల్ని లాక్కొత్తాము.”

“కొడుకు పెళ్ళి అంటున్నావు. కట్నాలు, కానుకలు గట్రా ఏమన్నా నువ్వు కోరుకోవాలిగానీ, తిరిగి ఇవ్వట మేమిటిరా? ఇదెక్కడి ఆచారం?” నిరసనగా అన్నాడు సంజీవరావు.

“అలాగంతా వేటి బావ్! పేగు సింపుకోని పుట్టిన పిల్లని పెంచీ పెద్ద జేసీ మన సేతల్ల ఎడతన్నరు. అది పెల్లయిన మర్నాటి కానించి మల్ల కాటికెల్లీ వరుకు మా కుటుమాం కోసం కష్టపడతాది. కన్నోరి రునం మనం ఏటిచ్చి తీర్పగలం. సెప్పండి బావ్!” అప్పన్న మాటల్తోపాటు అతని మనసు లోపలి తడికూడా బయటకు దొర్లింది.

“ఇంతకీ కోడలెలా ఉంటుందిరా అప్పన్నా !?” “సెప్పకేమి? శాకత్తి లా గుంటాది. పొరుగూ రే. తెలిసిన పిల్ల. అడివి కెల్తాది. సంత కెల్తాది. సమసార మెత్తుతాది. అది గందుకే ఆడు మను సు వడ్డాడు. నానెందుక్కా దనాల? ఆలు సుబ్బ రం గుండి కాపరం సేసుకుంతే నా కంతే శాన.”

సుభద్రమ్మ కాఫీ గ్లాసందించింది అప్పన్నకు. సంజీవరావు విషయమంతా చెప్పాడు.

“పోనీలెండి. శుభకార్యం అంటున్నాడు. ఇచ్చి పంపించండి” సిఫారసు చేసిందావిడ.

“అదేదో నీ చేత్తోనో ఇవ్వు. ముత్తయిదువవి కదా” చిరునవ్వుతో చమత్కరించాడు సంజీవరావు.

అప్పన్న ఇద్దర్నీ ఆరాధనగా చూస్తూ కాఫీ తాగటం పూర్తి చేశాడు. సుభద్రమ్మ వారిస్తున్నా వినకుండా గ్లాను కడిగి, పెరటి గుమ్మం దగ్గర బోర్లించి, మళ్ళీ వేపచెట్టు మొదట్లో కూలబడ్డాడు. సుభద్రమ్మ అయిదు వంద రూపాయల నోట్లు తెచ్చి అప్పన్న చేతుల్లో ఉంచింది. వాటి నలాగే కళ్ళ కద్దుకుని చెంగున ముడి వేసి, మొల్లో దోపుకున్నాడు అప్పన్న.

సంజీవరావు ప్లాస్టిక్ కవర్లోంచి పుగాకు కట్ట తీసి చుట్ట చుట్టుకొంటుంటే “ఒహ రెక్క ఇటిసిరి బావ్. నోట్లేసు కుంతను” వినయంగా అడిగాడు అప్పన్న. “ఇదేం అలవాటురా భడవా! చుట్ట కా ల్చడమే ఆరోగ్యానికి మంచిది కాదంటే, పుగాకు నమలటం ప్రమాదం. కాన్సర్ వచ్చేస్తుందని రేడియోలు, టీ.వీ.లు అలా ఘోష పెడ్తున్నాయి. వింటం లేదూ?” అప్యాయంగా మందలిస్తూనే ఓ రెక్క అప్పన్న చేతుల్లో వేశాడు సంజీవరావు.

“సదూకున్నాలంతా ఇంటి మాట్లే సెప్పుతారు బావ్. కట్నాలు, లంచాలు పుచ్చుకోడం తప్పని తెల్దా పెజలకి? అయినా ఇవ్వక తప్పుతున్నాది? వుచ్చుకోక మాన్తన్నారు? యిదీ అలాటిదే.”

“సెప్పిన మంచల్లా సెయ్యిడానికి అలివైతే ఈ పై పంచకం మీద ఇన్ని రోగాలుంతాయి? ఇన్ని గోరాలు జరగతాయి?” చనువుగా వాదించాడు అప్పన్న.

“సీకటి పడతంది. మరినా నెల్తాను బావ్‌” చేతులు జోడించి,సెలవు తీసుకున్నాడు అప్పన్న.

సంజీవరావుకు ఎక్కడో చురుక్కుమంది. కాసేపు విలవిల్లాడాడు. అప్పన్న మాటలు పదేపదే అతని మస్తిష్కంలో తొలుస్తుంటే అంతర్ము ఖుడై ఆత్మవిమర్శ చేసుకున్నాడు.

అప్పన్న అడవి మనిషి. అనాగరికుడు. సభ్య త, సంస్కారం, మానవత్వం లాంటి పెద్దమాటలకు అతనికి అర్థం తెలీక పోవచ్చు. కానీ మని షిని మనిషిగా అర్థం చేసుకునే అర్ద్రత, స్వచ్ఛత అతనికి పెట్టని ఆభరణాలు. కొడుకు మనసు పడ్డ పిల్లని ఎదురు కట్నమిచ్చి తెచ్చుకొంటున్నాడు. పైగా పిల్ల తల్లిదండ్రులపట్ల ఎంత సహృదయత, ఆర్ద్రత కనపరిచాడు. మానవ సంబంధాల్ని ఎంత ఉన్నతంగా ఊహించాడు?

మరి తనో? అపరాధ భావనతోనూ, ఆత్మ న్యూనతతోనూ ఆరుద్ర పురుగులా కుంచించుక పోయింది సంజీవరావు అంతరాత్మ.

మహావృక్షంలా మహోన్నతంగా ఎదిగి పోయిన అప్పన్న పాదాల చెంత గరిక మొలకలా మిగిలి పోయాడు తను!

మనసు పొరల్లో ఏ మూలో పొటమరించిన విచక్షణ అంతరాత్మను కుదిపి వేస్తూంటే 

“సుభద్రా! టేబిల్ మీది పోస్టుకార్డు, పెన్ను ఇలా తీసుకురా!” అంటూ కేకేశాడు సంజీవరావు.

ఆశ్చర్యపోతూనే అందించింది ఆవిడ. 

“ఎవరికట?”

“పాలకొండ వాళ్ళకు.”

భర్త ఉత్తరం రాస్తూంటే ఆసక్తిగా చూసింది సుభద్రమ్మ.

“........ మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. మీ వీలు చూసుకుని తొందర్లోనే ముహూర్తాలు పెట్టించగలరు..........”

వేపచెట్టు చివరి నుంచి కలకూజితం హృదయాలను ఆహ్లాద పరుస్తూంటే హాయిగా శ్వాస పీల్చుకున్నారు ఆ దంపతులు.

ప్రచురణ కాలం: 27.2.91, 

‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రిక, 

‘కథా నిలయం’ సౌజన్యంతో..