14-08-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి గత ప్రభుత్వం అనేక మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు లేకుండా చేసింది. మూడు, నాలుగు మండలాలు పక్క జిల్లాల్లో చేర్చడం.. ఒక్కో జిల్లాను నాలుగు, ఐదు జిల్లాలుగా ఏ మాత్రం ప్రణాళిక లేకుండా చేసి అయోమయానికి గురి చేశారు. అయితే తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల వర్గీకరణలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో.. స్థానికుల స్థానికతను ప్రశ్నార్థకంగా మార్చింది.
హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులను సీనియర్ పేరిట విభజించారు. జూనియర్ ఉద్యోగులు పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, చదివిన ప్రాంతాన్ని, కన్నవారిని, కట్టుకున్నవారిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి రావడం ఆందోళనకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నుంచి పదోతరగతి వరకు ఏడు సంవత్సరాలు ఎక్కడ చదివితే దానినే లోకల్‌గా పరిగణించి ఉద్యోగాలకు, టీచర్ పోస్టులకు ఎంపిక చేసేవారు.
317 జీవో ప్రకారం ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరగలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమాలు, పోరాటాలు చేస్తే సమైక్యాంధ్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముల్కీ, నాన్ ముల్కీ అంటూ విభజన చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశారు. ఎవరైతే స్థానికులో వారు ముల్కీ.. స్థానికులు కాని వారు నాన్ ముల్కీ కింద పరిగణించారు. దీంతో తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయం తేటతెల్లమైంది. విద్య, ఉద్యోగాల్లో 80 శాతం లోకల్, 20 శాతం నాన్ లోకల్ కోటా కింద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేశారు.
మహిళల పాలిట శాపంగా..
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల వర్గీకరణ కోసం తీసుకొచ్చిన 317 జీవో మహిళల పాలిట శాపంగా మారింది. కొత్తగా కేటాయింపు జరిగిన జిల్లాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులు వెళ్లి పని చేయడానికి ఆర్డర్లు సిద్దం చేశారు. అయితే కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనడం సమంజ సం కాదంటున్నారు. ఉద్యోగ కేటాయింపు సీనియర్, జూనియర్ కాకుండా స్థానికత ఆధా రంగా జరగాలని కోరుతున్నా రు.
ఈ విషయమై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయని గత ప్రభుత్వం 317 జీవోను గాలికి వదిలేయడంతో బాధితుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 317 జీవో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒక సంఘంగా ఏర్పడి తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలే ధర్నాలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఇప్పుడైనా పరిష్కారమయ్యేనా?
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం ఉద్యోగుల్లోనూ కలుగుతుంది.
సీఎం రేవంత్ 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బదిలీల విషయమై సీఎం స్పందించడంతో జూనియర్ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్పౌజ్, మ్యూచువల్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం త్వరలోనే 317 జీవో బాధితుల సమస్యను మానవత దృక్పథంతో పరిష్కరిస్తారనే నమ్మకం ఏర్పడింది.
వ్యాసకర్త సెల్: 9290826988