19-08-2025 02:03:28 AM
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 18: ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 9 గేట్లను సోమవారం ప్రాజెక్టు అధికారులు ఎత్తారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ర్టలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతున్నది. మరోవైపు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు పదిహేను ఎత్తడంతో ప్రాజెక్టు నీరంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది.
దీంతో ఎస్సారెస్పీకి నిండికుండలా మారింది. దీంతో సోమవారం అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. జలాశయం పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,089(73.37టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. 9 గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తారు.
ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 29,444 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఐదు గేట్లను ఎత్తి 31, 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు)కు గాను 457.80 మీటర్లు (1.200 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా 1,182 అడుగులు నిల్వ ఉంచుతూ 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పెంబి మండలంలోని పసుపుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో 12 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానం బైలు వద్ద గల కిన్నెరసాని జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు జలాశయం నీటిమట్టం 404.90 అడుగులకు చేరుకుంది. 2,700 క్యూసెక్కుల నీరు కొత్తగా వచ్చి జలాశయంలో చేరుతోంది. నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 404.90 అడుగులకు చేరుకుంది.
దీంతో జెన్కో అధికారులు సోమవారం రాత్రి 10 గంటలకు రెండు గేట్లను ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తి 20,534 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని ములకలపల్లి మండలంలో ఉన్న మూకమామిడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు మత్తడి పోస్తుంది. 24 అడుగుల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా రావడంతో అలుగు ద్వారా మిగులు నీరు బయటకు వెళ్తుంది.
సాగర్ వద్ద కృష్ణమ్మ జలసవ్వడి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం అధికారులు 10 గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 885 అడగులు(215 టీఎంసీల) సామర్థ్యం గల శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 881.60 ఫీట్ల(197.0114 టీఎంసీల)ల నిల్వ ఉన్నది. మొత్తం 3,31,699 క్యూసెక్కుల నీటిని నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వదులుతున్నారు. దీంతో ఎన్‌ఎస్పి అధికారులు 26 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.