calender_icon.png 19 August, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలదిగ్బంధనంలో ఏడుపాయల వనదుర్గ

19-08-2025 01:40:08 AM

పాపన్నపేట: మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో ఏడుపాయల వనదుర్గ భవాని జలదిగ్బంధనంలో చిక్కుకుంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో మంజీరా నది పరివాహక ప్రాంతం మొత్తం జలమయం అయింది. సింగూర్ ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో ఏడుపాయల వన దుర్గ భవాని ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఆనకట్ట దిగువన ఉన్నటువంటి ఏడుపాయల గుండా మంజీరా నీరు ఉదృతంగా ప్రవహిస్తూ  వన దుర్గ భవాని గుడిని చుట్టుముట్టాయి.

వరద ప్రవాహాన్ని ముందుగానే గుర్తించిన ఆలయ అధికారులు రాజగోపురంలోనే భక్తుల సౌకర్యార్థం వనదుర్గ మాత విగ్రహాన్ని ను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎప్పటికప్పుడు మండల అధికారులతో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. వర్షాలకు ఆయా గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని అటువంటి వారిని ముందస్తుగా గుర్తించి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మంజీరా వరద ప్రభావిత  గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఏడుపాయల ఆలయం వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులు ఎవరు కూడా నది పాయ ప్రాంతాల వైపు, ఆనకట్ట వైపు వెళ్లకుండా ఉండేలా చూడాలని ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ కి సూచించారు