19-08-2025 01:43:26 AM
కాపుగల్లులో ఘనంగా శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు
కోదాడ: 330 మందికి పైగా స్వామీజీలు భగవద్గీతకు వివరణ వ్రాసినప్పటికీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వివరణ వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీత శ్రీకృష్ణుడి నిజభావాన్ని బహిర్గతం చేసిందని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ మందిరం ఆవరణలో ఏర్పాటుచేసిన శ్రీకృష్ణ ప్రతిమను పల్లకీలో ఉంచి ఘనంగా ఊరేగించారు.
ఆయన మాట్లాడుతూ త్రైత సిద్ధాంతం ఆధారంగా ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు 101 గ్రంథాలు రచించి దేవుడి జ్ఞానాన్ని శాస్త్రబద్దంగా బోధిస్తే కొంతమంది ఏమీ చదవకుండా, వినకుండా త్రైత సిద్ధాంత గ్రంథాలపై విమర్శలు చేయడం విచారకరం అన్నారు. త్రైత సిద్ధాంత గ్రంథాలపై విమర్శలు చేసేవారు ముందుగా గ్రంథాన్ని పూర్తిగా చదివిన తర్వాత అభ్యంతరం ఉన్న వాక్యం గురించి అడిగితే బాగుంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు.