calender_icon.png 19 August, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పొంగుతున్న గోదావరి

19-08-2025 02:00:57 AM

  1. భద్రాచలం వద్ద 38 అడుగులకు నీటిమట్టం
  2. నీట మునిగిన స్నాన ఘట్టాలు 
  3. ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

భద్రాచలం/మహబూబాబాద్/మహదేవపూర్(భూపాలపల్లి)/కోరుట్ల, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదులతో పాటు వాగులు పొంగి ప్రవహించడం వల్ల గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు 33 అడుగులు చేరుకున్న గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రం 6 గంట లకు 38 అడుగులు చేరుకొని ఇంకా పెరుగుతూనే ఉన్నది.

మంగళవారం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విధంగా పెరుగుతూ 43 అడు గులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు. నీటిమట్టం పెరుగుతూ ఉండటంతో భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పర్ణశాల సమీపంలోని సీతవాగు సైతం పొంగి ప్రవహిస్తుండటంతో సీతరాముడు సంచరించిన నారా చీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది.

సోమవారం ఉద యం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో 77 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మహారాష్ర్టలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.

కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది కలవ డంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుకున్నది. మేడిగడ్డ (లక్ష్మి) ప్రాజెక్టు వద్ద 5 లక్షల క్యూసెక్కులతో గోదావరి ఉప్పొంగి ప్రవహిం చడంతో బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.  మహబూబాబాద్ జిల్లా గంగారం మండల పరిధిలో ఉన్న ఏడుబావుల జలపాతం ప్రమాదకరంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ యువకుడు అందు లో పడి మరణించడంతో జలపాతం  సందర్శనను పోలీసులు నిలిపివేశారు.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గోదావరి వరద ఉధృ తి పెరుగుతున్నది. నది వైపు ఎవరు వెళ్లకుం డా అధికారులు హెచ్చరిక బోర్డులను ఎర్పా టు చేశారు. మండలంలోని గోదుర్, తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా, యమాపూర్, ఫకీర్ కొండాపూర్, వేములకుర్తి, బర్దిపూర్, మూలరాంపూర్, ఎర్దండి ,కేశపూర్, కోజన్ కొత్తూరు, కోమటి కొండాపూర్, వర్షకొండ, డబ్బా, ఎర్రపుర్, అమ్మకపెట్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో రహదారులు జలమయ మయ్యాయి. ఫకిర్ కొండాపూర్-యామాపూర్ మధ్య రహదారి జలమయమైంది.